సాక్షి, రాజన్న సిరిసిల్ల : ‘జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు ఉంది కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి’ అంటూ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ వాళ్లు మాత్రం చనిపోయిన వాళ్ల వేలి ముద్రలు వేసి కోర్టుకు వెళ్లారని విమర్శించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఇసుక ద్వారా రాష్ట్రానికి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరిస్తే.. కాంగ్రెస్ హయాంలో 40 కోట్ల ఆదాయం కూడా రాలేదని విమర్శించారు. మూడేళ్ల కాలంలో సిరిసిల్ల రూపురేఖలు మార్చామని, ఎవరూ ఊహించని విధంగా జిల్లాను అభివృద్ధి చేశామన్నారు. తాను చెప్పినవి అబద్ధమైతే వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాలన్న కేటీఆర్.. నిజమని నమ్మితే కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కకుండా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
మీ రుణం తీర్చుకుంటా..
‘నాకు జన్మనిచ్చింది నా తల్లి అయితే రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్లా ప్రజలే కాబట్టి మీ రుణం తీర్చుకుంటా. కేసీఆర్‌ను గద్దె దించాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎవరూ కలగనని విధంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతున్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు ఆయనను గద్దె దింపాలా’ అంటూ కేటీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment