
సాక్షి, అమరావతి : అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. కేంద్రం నిధులతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులా ప్రచారం చేసుకోలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజనగా అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పాం.. కానీ దానిని రూ.13,500కు పెంచామని గుర్తుచేశారు. మేనిపెస్టోలో నాలుగేళ్లు అని చెప్పినప్పటికీ.. రైతుల కోసం ఐదేళ్లు రైతు భరోసా అమలు చేయనున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలో పెట్టుబడి సాయం రూ. 50వేల నుంచి రూ. 67,500కు పెంచామని అన్నారు.
చంద్రబాబు నాయుడు చివరి నాలుగు నెలలు ఎన్నికల కోసం పథకాలు ప్రవేశపెడితే.. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు రుణమాఫీ ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే దానిని తగ్గించారని మండిపడ్డారు. రైతు భరోసా ద్వారా రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చామని తెలిపారు.
చంద్రబాబు, కరువు కవల పిల్లలు : మోపిదేవి
అనంతరం మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వ్యవసాయ మిషన్ ప్రారంభించారని తెలిపారు. రైతు పంట వేసినప్పటి నుంచి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటోందని చెప్పారు. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి.. గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని గుర్తుచేశారు. శనగ రైతులకు గిట్టుబాట ధర ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు.
రైతు బజార్లలో తక్కువ ధరకే ఉల్లి, టమోటా అందిస్తున్నామని తెలిపారు. ఓ వైపు రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ.. అదే సమయంలో వినియోగదారుడిపై భారం లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఎక్కడిక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రైతు ఏ పంట పండించినా ఈ క్రాప్ నిబంధనలు సడలిస్తున్నామని పేర్కొన్నారు. 24 గంటల్లోనే ఈ క్రాప్ బుకింగ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు. వరుణుడు, వైఎస్సార్ ఫ్యామిలీ కవల పిల్లలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment