లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని తెలుగుదేశం దొంగలంతా కలిసి ఘనంగా చేసుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబును తిట్టని వారు లేరని, పార్థీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌నే బయటకు గెంటేసిన హీనచరిత్ర చంద్రబాబు నాయుడు సొంతమని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. తన అల్లుడు చంద్రబాబు చేతిలోనే ఎన్టీఆర్ దారుణంగా మోసపోతారని ఎవరూ అనుకోలేదన్నారు. ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుని పూలు వేసే అర్హత ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినట్లు గతంలో చంద్రబాబు ప్రకటించారు. అలాంటిది ఆయన విగ్రహం ఎందుకు పెట్టుకుంటున్నారని, ఎన్టీఆర్ లేనిది పార్టీకి వ్యవస్థాపక దినం ఎలా ఉంటుందన్నారు.
నందమూరి వారు స్థాపించిన పార్టీ నారా వారి సొంతమా?
ఎన్టీఆర్ పార్టీలో చేరిన చంద్రబాబు ఆయన నచ్చకపోతే బయటికి వెళ్లాలి కానీ వెన్నుపోటు పొడిచి మామ నుంచి పార్టీని లాగేసుకున్నారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ సంతోషంగా లేరు. వైస్రాయ్ హోటల్లో చెప్పుల దాడి సమయంలో విషయం బయటకు రాకుండా మీడియాను దిగదార్చింది చంద్రబాబు అని.. ఇప్పుడు కూడా ఎంతో అవినీతికి పాల్పడుతున్నా అలానే చేస్తున్నారని విమర్శించారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నారా వారికి ఎలా సొంతమవుతుందని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను చంపి అయినా చంద్రబాబు అధికారం హస్తగతం చేసుకుంటాడని శ్రీనివాసులు రెడ్డి అప్పుడే చెప్పారని లక్ష్మీపార్వతి వెల్లడించారు.
ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబుకు లేదు
అసలు ఎన్నికల్లో ఎప్పుడన్నా చంద్రబాబు సొంతంగా గెలిచిన దాఖలాలున్నాయా. 1994 నుండి 2004 వరకు జరిగిన 40 ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ఓటమిపాలయ్యారు. తన బలహీనతను కప్పిపుచ్చుకునేందుకే మీడియాలో ముందే లీక్స్ ఇస్తాడు చంద్రబాబు. నువ్వు ప్రధానిని చేసిన దేవేగౌడ ఎన్నిసార్లు తిట్టారో తెలుసు, ఐకే గుజ్రాల్ తిట్టిన విషయం అందరికీ తెలుసు. ఎన్టీఆర్ బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింప చేసి ఆయన గుండెపోటుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు కాదా?. ఎన్టీఆర్ శవంతో కూడా రాజకీయం చేయడం చేసి లబ్ధి పొందడం ఎవరూ మర్చిపోలేరు.
600 హామీలు.. ఏం సాధించావు..
గత ఎన్నికల సమయంలో అధికారం కోసం ఏకంగా 600కు పైగా హామీలు చంద్రబాబు ఇచ్చారు. కానీ సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలాడి మోసం చేస్తే.. ఇక్కడ ఏపీ ప్రజలు నీ డ్రామాలు చూస్తున్నాం. చంద్రబాబు తన బాధను ప్రజల బాధగా సృష్టిస్తున్నారు. నువ్వు, నీ కొడుకు నారా లోకేశ్ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నది నిజం కాదా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు మీద వేసిన కేసుల్లో ఏ ఒక్కటి విచారణ చేపట్టినా ఆయన బండారం బయటపడుతోంది.
ప్రజల గుండెల్లో వైఎస్ఆర్
అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. రైతులు, విద్యార్థులు, పేదల కోసం కానీ ఆయన మరణానంతరం ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తిచేయకపోవడంతో అసమర్ధ సీఎంగా చంద్రబాబు నిలిచారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని వైఎస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తే.. అబివృద్ది నిరోధకులు అని వ్యాఖ్యానించావు. కానీ కేంద్ర ప్రభుత్వం నీ జుట్టు పట్టుకుంటుంటే మాత్రం వారికి భయ పడుతున్నావన్నది వాస్తవం. ఈ రోజును తాను టీడీపీ సంతాప దినంగా చూస్తానని లక్ష్మీపార్వతి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment