సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఫ్యాను గాలి బలంగా వీస్తోందని, 130 సీట్లు గెలిచి భారీ మెజార్టీతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉభయగోదావరిలో గతంలో కంటే ఈసారి భారీగా సీట్లను సాధిస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలు, చౌకబారు రాజకీయాలు మానవా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. నవరత్నాలను దొంగిలించాడని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయి వచ్చాడని చంద్రబాబును విమర్శించారు.
వ్యక్తిగత డేటాను లీక్ చేయించి, అశోక్ అనే వ్యక్తిని దాచింది చంద్రబాబే అని ఆరోపించారు. అశ్వనీదత్, మురళీమోహన్, రాఘవేంద్రరావులను పక్కన పెట్టుకుని సినీ రాజకీయాలు చేద్దామనుకున్నారు కానీ, ఈరోజు స్వచ్చందంగా సినీ రంగం అంతా కూడా కదిలి జగన్‌కు అండగా నిలిచిందని పేర్కొన్నారు. మోహన్‌బాబుపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహించారు. మురళీమోహన్‌లా ఎన్టీఆర్‌ను వదిలీ మోహన్‌బాబు పారిపోలేదని గుర్తుచేశారు. ఆ రోజు నాయకులను ప్రలోభపెట్టి వైశ్రాయ్ హోటల్‌లో చంద్రబాబు దాచాడని అన్నారు.
మోహన్‌బాబు వ్యక్తిగతంగా.. తమకు ఎటువంటి హాని చేయలేదని, చంద్రబాబేనని తమను అవమానించారని తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు నిజస్వరూపం చూపించారని అన్నారు. బాంబులకు భయపడనని చెప్పుకునే నాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చేసింది, చనిపోవడానికి కారణమైంది చంద్రబాబే అని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే అని దుయ్యబట్టారు. మంగళగిరి అని మాట్లాడటం రాని తన కొడుకును ఈ రోజు ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు.. ఈ రోజు వైఎస్ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment