![Lakshmi Parvathi lashes out at chandrababu over Lakshmi’s NTR movie - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/21/laxmi.jpg.webp?itok=WqFAruHu)
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మరిచిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూడద్దొంటూ చంద్రబాబు ఏవిధంగా చెబుతారని ఆమె సూటిగా ప్రశ్నించారు. పార్టీ నేతలకు ఏ సినిమా చూడాలో కూడా చంద్రబాబే చెప్పడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. వాస్తవాలు ఉన్నాయి కనుకనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటే చంద్రబాబు భయపడుతున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్‌పై బాలకృష్ణ తీసిన సినిమాల్లో వాస్తవం లేదు కాబట్టే.. ఆ సినిమాలను ప్రజలు ఆదరించడం లేదన్నారు. ఆ సినిమాలతో బయోపిక్‌కు అర్థమే మార్చేశారని ఆమె ఎద్దేవా చేశారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ ధైర్యంగా, నిజాయితీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా అసలు విషయాన్ని ప్రజల్లోకి తెస్తున్నారని, ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఈ సినిమా ద్వారా ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని, లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వాటీజ్ దిస్ అనేది...ఈ సినిమాతోనే తెలుస్తుందన్నారు. బయోపిక్ అంటూ బాలకృష్ణ ఏం చూపించలేదో, తాను అది చూపిస్తానంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెబుతున్నారని అన్నారు.
ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసుకునే చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లేనని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి, ఆయన పతనానికి కారణం అయిన చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అలా చేయలేదని ఖండించాలని సవాల్ విసిరారు. తాను చేసిన పాపాలన్నీ చంద్రబాబును నలువైపుల నుంచి కారు మేఘాల్లా కమ్ముకు వస్తున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు. ఆ కారణంగా తనపై నిందలు వేసి, అవాస్తవాలు ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక‍్తం చేశారు. ఎన్టీఆర్ మరణం, ఆనాటి పరిణామాలపై విచారణ కమిటీ వేయాలని తాను అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా అడిగినా, పట్టించుకోలేదని అన్నారు. చరిత్రను దిక్కు, మొక్కు లేకుండా చేయాలని చూసిన చంద్రబాబు దుర్మార్గం ఇన్నాళ్లకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రూపంలో బయటపడుతుందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment