
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌పై ఉగ్రసంస్థ లష్కరే తాయిబా సంచలన ప్రకటన చేసింది. కశ్మీర్‌లో గవర్నర్ పాలనను వ్యతిరేకిస్తూ గురువారం ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల మూలంగా కశ్మీర్‌లో నరమేధం జరిగే అవకాశం ఉందని అభిప్రాయడింది. లష్కరే చీఫ్ మహ్మద్ షా పేరిట గురువారం ఓ మెయిల్ భారత మీడియా ఛానెళ్లకు చేరింది. (ముష్కరుల ఏరివేత కోసం...)
ఇది నరమేధమే... ‘మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్ సహా మిగతా నేతలు అభిప్రాయాలతో మేం ఏకీభవిస్తున్నాం. ఇకపై అమాయకులైన కశ్మీరీలు పెద్ద సంఖ్యలో మరణిస్తారు. వారిని ఊచకోత కోసేందుకే గవర్నర్ పాలన విధించారు. మళ్లీ జగ్మోహన్ (1990లో కశ్మీర్ మాజీ గవర్నర్) రోజులను గుర్తుకు తెస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సైనిక చర్య దిగుతోంది. ఆపరేషన్ ఆల్‌అవుట్ పేరిట కశ్మీరీలను చంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 8 లక్షల మంది సైనికులు జమ్ములో అరాచకాలకు పాల్పడుతున్నారు. కశ్మీర్ లోయలో ప్రజలు బానిసలుగా బతుకుతున్నారు. జర్నలిస్ట్ బుఖారీ భారత దళాల ప్రధాన అజెండాలను బయటపెట్టేందుకు యత్నించారు. ఆరెస్సెస్ ఎజెండాను తీసికెళ్లడంలో పీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన వంతు ప్రయత్నం చేశారు. కశ్మీర్‌పై ఐరాస మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదిక ప్రత్యేకం, ఆలస్యమైన ఐరాస అసలు విషయాన్ని గమనించింది. అయితే అక్కడి దుస్థితిని వివరించేందుకు ఈ ఒక్క నివేదిక సరిపోదు’’అని మీడియా సంస్థలకు పంపిన ఈమెయిల్‌లో దుయ్యబట్టారు. ఈ పరిణామం రాజకీయంగా వివాదాన్ని రేపుతోంది. కాంగ్రెస్‌కు లష్కరే లాంటి ఉగ్రవాదసంస్థలు కొమ్ముకాస్తున్నాయని బీజేపీ ధ్వజమెత్తింది.
ఆజాద్ ఏమన్నారంటే... ‘ఉద్ధృతమైన మిలటరీ ఆపరేషన్ అంటే అమాయకుల ఊచకోతే. ఎందుకంటే ఉగ్రవాదుల కంటే ప్రజలనే ఎక్కువ సంఖ్యలో సైనిక, పారా మిలటరీ దళాలు చంపుతున్నాయి. సగటున నలుగురు టెర్రరిస్టులకు 20 మంది ప్రజలను హతమారుస్తున్నారు. పుల్వామాలో ఒక్క ఉగ్రవాదిని చంపడానికి 13 మంది ప్రజలను పొట్టనపెట్టుకున్నారు. ఆర్మీ బలగాల చర్యలు సామాన్యుల పాలిటే వ్యతిరేకంగా ఉన్నాయి. ‘ఆలౌట్ ఆపరేషన్’ అంటూ బీజేపీ ఉపయోగిస్తున్న భాష నరమేధం దిశగా ఆ పార్టీ నేతల ప్రణాళికను సూచిస్తోంది. ’’ అని వ్యాఖ్యానించి గులాంనబీ అజాద్ దుమారం రేపారు.