
సాక్షి, కోహిమా : ‘మాకు పార్టీలతో ప్రమేయం లేదు. నాయకుడు మంచి వాడా, కాదా ? అన్నదే మాకు ముఖ్యం’ అని ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నాగాలాండ్‌లోని రిఫ్యీమ్ విలేజ్ కౌన్సిల్ చైర్మన్ ఎన్. ప్యాటన్ చెప్పారు. ‘మాకు మంచి నీరు ఉంది. విద్యుత్ ఉన్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రమూ ఉంది. అంతేకాకుండా రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఓ క్యాథలిక్ పాఠశాల ఉంది. ఇలాంటి ప్రాథమిక సౌకర్యాల కోసం కృషి చేసిన నాయకుడికే ఓటు వేస్తాం’ అని ఆయన అన్నారు.
ఆయన మాటల్లో అక్షరాల నూటికి నూరుశాతం నిజముంది. దేశంలోని ఓటర్ల మనస్తత్వంతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల ఓటర్ల మనస్తత్వమే కాస్త భిన్నంగా ఉంటుంది. వారితో పోలిస్తే నాగాలాండ్ ఓటర్ల మనస్తత్వం మరికాస్త భిన్నంగా ఉంటుంది. నాగాలాండ్ బాగా వెనకబడిన ప్రాంతం అవడం వల్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడికీ లేదా ఆ నాయకుడు చెప్పిన అభ్యర్థికే నాగాలు ఓట్లు వేస్తారు. వారు సాధారణంగా రాజకీయ పార్టీలను పట్టించుకోరు. అందుకే 60 సీట్లుగల నాగాలాండ్ అసెంబ్లీకి 2013లో జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈ సారి తన వ్యూహాన్ని మార్చుకొని, ప్రజల్లో గుర్తింపు ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకుంది.
అలా చేరిన వ్యక్తే వై. ప్యాటన్. నాగా పీపుల్స్ ఫ్రంట్‌లో హోం మంత్రిగా మొన్నటి వరకు పనిచేసిన ఆయన తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన 1998లో కాంగ్రెస్ తరఫున, 2008లో బీజేపీ తరఫున, 2013 నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున పోటీ చేసి గెలిచారు. నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నీఫ్యూ రియోతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడం కూడా అందులో భాగమే. బీజేపీయే ఆయనతోని ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీని పెట్టించిందనే ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలోకి వచ్చి ఆ తర్వాత నాగా పీపుల్స్ ఫ్రంట్‌లో చేరిన రియో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి కేఎల్ ఛిశీని కూడా బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి వచ్చిన ఛిశీ, బాగా సంపన్నుడు కూడా. ఆయనకు 51 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటారు.
నాగాలాండ్‌లో అభివృద్ధి పనుల ద్వారా ఆకట్టుకున్న నాయకులనే కాకుండా డబ్బున్న నాయకులను కూడా ప్రజలు గుర్తిస్తారు. డబ్బున్నట్లయితేనే ఆ డబ్బులో అంతో ఇంతో ఖర్చుపెట్టి తమ సమస్యలను తీరుస్తారన్నది ప్రజల విశ్వాసం. ఈ మధ్య తుపాకీ సంస్కృతిగల నాయకులను కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. దోపిడీ దొంగలనే కాకుండా దురాగతాలకు పాల్పడే అరాచక శక్తులను అలాంటి నాయకులే అణచివేయగలరన్నది వారిలో ఉన్న మరో నమ్మకం. నాగాలాండ్‌లో అంగామీ, లట్టా బలమైన తెగలు. రియో అంగామీకి, ఛిశీ లట్టా తెగలకు చెందిన వారు. నాగాల్లో మరోగుణం కూడా వారు మెజారిటీ అభిప్రాయానికి విలువనిస్తారు. ఎన్నికల సమయంలో గ్రామాల వారిగా సమావేశమై తమ గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయిస్తారు. చాలా సందర్భాల్లో మెజారిటీ అభిప్రాయానికి కట్టుబడుతారు. సహజ సిద్ధంగా వారు పాపులర్ నాయకుడికే ఓటు వేయాలని నిర్ణయిస్తారు. అస్సాం, మేఘాలయాల్లో లాగా నాగాలాండ్ ప్రజలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీవైపే మొగ్గు చూపుతారు. అందుకే ప్రజాధరణ పొందిన నాయకులు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి వలసపోతారు. గతంలో కాంగ్రెస్ విషయంలో, ఇప్పుడు బీజేపీ విషయంలో అదే జరిగింది.
సారా తాగించి, డబ్బుల పంచే అభ్యర్థులకు ఓటేసే విష సంస్కతికి కూడా ఇప్పుడిప్పుడే తమ రాష్ట్రంలో వేళ్లూనుకుంటోందని నాగా బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంస్కృతిని నిర్మూలించే దృష్టితో పోటీచేసే అభ్యర్థులు, ఓటర్ల బాధ్యతలను గుర్తుచేస్తూ వారు పాటించాల్సిన నిబంధనలను తెలియజేస్తూ ఊరూరా పోస్టర్లను అతికించింది. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో పొత్తుపెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా చరిత్ర సృష్టించాలని ఆశిస్తున్న బీజేపీ తన హిందుత్వ ఎజెండాను ఇక్కడ పక్కన పెట్టింది. గోమాంస అంశాన్ని అస్సలు ప్రస్తావించడం లేదు. నాగాలు దాదాపు అన్ని తెగలవారు ఎక్కువగా తినేదే గోమాంసం.