
రరాజకీయ సంక్షోభ సమయాన మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పాత్ర కీలకంగా మారనుంది. ప్రస్తుత స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. చట్ట ప్రకారం శాసనసభ్యులు తమ రాజీనామా పత్రాలను సభాపతికి పంపించాల్సి ఉంటుంది. అయితే రాజీనామా పత్రాలు స్పీకర్‌కి సమర్పించినంత మాత్రాన సరిపోదు. వాటిని స్పీకర్ ఆమోదించినప్పుడే ఆ రాజీనామాలను అధికారికంగా గుర్తిస్తారు.
►రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 ఒక శాసనసభ్యుడు ఎలా రాజీనామా చేయొచ్చు అనే విషయాన్ని చర్చిస్తుంది. ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ని ఉద్దేశించి రాయాల్సి ఉంటుంది. దాన్ని కేవలం స్పీకరే మాత్రమే ఆమోదించాల్సి ఉంటుంది. (గవర్నర్ కాదు).
►శాసనసభ్యులు సమర్పించిన రాజీనామాలు ఎవరి ఒత్తిడి వల్ల చేసినవి కావనీ, అవి వారి వారి ఇష్టపూర్వకంగా చేసినవేననీ స్పీకర్ భావించాలి. స్పీకర్‌కి విశ్వాసం కలగకపోతే దానిపైన స్వతంత్రంగా విచారణ జరిపే అధికారాన్ని కూడా ఈ ఆర్టికల్ స్పీకర్‌కి ఇచ్చింది.
►ఒకవేళ రాజీనామా స్వతంత్రంగా చేసింది కాదనీ, ఎవరి ఒత్తిడితోనైనా చేసిన రాజీనామా అని స్పీకర్ నమ్మినట్టయితే రాజీనామాని ఆమోదించకుండా ఉండే అవకాశం కూడా సభాపతికి ఉంటుంది.
►శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించడం కూడా స్పీకర్‌పైనే ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు సమ్మతించింది.
►స్పీకర్ ఆమోదముద్ర వేయకుండానే ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరిపోతే వారు పార్టీ ఫిరాయింపు చట్ట పరిధిలోకి వస్తారు.