ముంబై: మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి తుదిగడువు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచారానికి కొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో అస్త్రశస్త్రాలను ఉపయోగించేందుకు సిద్దపడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న బాడీగార్డ్, ముఖ్య అనుచరుడు గుర్మీత్ సింగ్ అలియాస్ షేరా శుక్రవారం శివసేనలో చేరారు.
గుర్మీత్ సింగ్‌కు శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఎన్నికల పోలింగ్‌కు కొద్ది గంటల ముందు సల్మాన్ ఖాన్ అనుచరుడు శివసేనలో చేరడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఏ ఉద్దేశంతో పార్టీలో చేరాడనే దానిపై చర్చించుకుంటున్నారు. గుర్మీత్ సింగ్ పార్టీలో చేరే కార్యక్రమంలో ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలు ఇద్దరూ పాల్గొనడంతో వారి అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఇక సోమవారం(అక్టోబర్ 21) మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment