సాక్షి, హైదరాబాద్: కోటి మంది కేసీఆర్‌లు అడ్డొచ్చినా.. ప్రజలకు, రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, వాళ్లకు అండగా ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభద్రతా భావంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారని ఆరోపించారు.
రూ.లక్ష కోట్లతో 30 ఇరిగేషన్ ప్రాజెక్టులకు కాంగ్రెస్ రూపకల్పన చేసి పనులు ప్రారంభించిందన్న విషయం కేసీఆర్ మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అనుకూలమని, టీఆర్‌ఎస్ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని విమర్శించారు.
కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం మర్చిపోయి మూడేళ్లుగా మాటలతో గడిపేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత–చేవెళ్లకు రీ డిజైనింగ్ అని చెప్పిన ఏడాది తర్వాత పనులు చేపట్టారన్నారు. ప్రజల సమస్యలపై పోరాడిన ఉత్తమ్ లక్ష మంది ఉత్తమ్‌లలాగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. పులిచింతల నిర్వాసితులకు ఉత్తమ్ పోరాడి పరిహారం ఇప్పించారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment