
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో కమలనాథులు ఇరుకునపడ్డారు. ఇదే అదునుగా మిత్రపక్షాలు, విపక్షాలు కాషాయ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బీజేపీ, నరేంద్ర మోదీ పనైపోయిందని ఎద్దేవా చేశాయి. మరోవైపు విపక్షాలు పరస్పరం ప్రశంసించుకున్నాయి.
శివసేన విసుర్లు
ఆదిత్యనాథ్ యోగి పాలనను ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని బీజేపీ మిత్రపక్షం శివసేన వ్యాఖ్యానించింది. బీజేపీ గొప్పలు చెప్పుకోవడం మానేయాలని, ఒక్క నరేంద్ర మోదీ చరిష్మాతోనే ఎన్నికల్లో గెలవలేరని హితవు పలికింది.
రోజులు దగ్గరపడ్డాయి: కాంగ్రెస్
రైతులు, యువత, మహిళా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దీనికి యూపీ, బిహార్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితానే నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.
మమత అభినందనలు
అఖిలేశ్‌యాదవ్, మాయావతికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు ముందడుగు పడిందని ఆమె ట్వీట్ చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూడా మమత అభినందనలు తెలిపారు.
బీఎస్పీకి థ్యాంక్స్
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, పూల్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో బహుజనసమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తల పాత్ర ఎంతో ఉందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ ప్రశంసించారు. బీఎస్పీ నాయకత్వానికి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.