వేసవికాలంలో తలెత్తే తాగునీటి సమస్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ కె. సురేష్‌బాబు ఆదేశించారు. బుగ్గవంక వద్దనున్న బోర్లన్నీ ఎండిపోయినందున ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకున్నామన్నారు. భగత్ సింగ్ నగర్ వద్ద గతంలో వేసిన పైపులైన్ రోడ్డు పనుల వల్ల డ్యామేజీ అయిందని, దాన్ని సరిచేసి మనుగడలోకి తీసుకురావాలన్నారు. పెన్నానది ఎండిపోయినందున నీటికి ఇబ్బంది తలెత్తకుండా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. ఎర్రముక్కపల్లె, మామిళ్లపల్లె, ఊటుకూరు వంటి ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. చాలా ఏళ్లక్రితం చనిపోయిన వారి ఆస్తులకు పేరు మార్పు చేయాల్సి వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యులతో అఫిడవిట్ తీసుకొని చేయాలన్నారు.
కడప కార్పొరేషన్: వేసవి కాలంలో తలెత్తనున్న తాగునీటి ఎద్దడిపై కడప నగరపాలక సర్వసభ్య సమావేశంలో వాడీ వేడీ చర్చ జరిగింది. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మేయర్ సురేష్‌బాబు అధ్యక్షతన జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. తొలుత 2019–20 బడ్జెట్‌పై చర్చ నిర్వహించారు. ఈ సం దర్భంగా 38వ డివిజన్ కార్పొరేటర్ మగ్బూల్‌బాషా మాట్లాడు తూ గత ఏడాది కంటే ఈసారి రూ.50కోట్లు అదనంగా ఎందుకు ఖర్చు చూపారని ప్రశ్నించారు. దీనిపై ఎంఈ కేఎం దౌలా సమాధానమిస్తూ ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి, తాగునీటి కోసం ఆదనపు నిధులను వినియోగిస్తామని చెప్పారు. మగ్బూల్‌బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ రాయితీ వల్ల కార్పొరేషన్ ఎంత ఆదాయం కోల్పోయిందో చెప్పాలన్నారు.
కార్పొరేషన్‌లో 500లకుపైగా టీటీపీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రజల నుంచి డబ్బు కట్టించుకొని ఆరునెలలుగా వారిని తిప్పుకుంటున్నారని తెలిపారు. దీనిపై అడిషనల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సమాధానమిస్తూ ప్రాపర్టీ విలువ పెరిగినందు వల్ల వారు కట్టిన డబ్బుకు అదనంగా చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఇలాంటివి 88 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సభ్యులు హరూన్‌బాబు మాట్లాడుతూ గతంలో పేరు మార్పిడికి రూ.250 తీసుకునేవారని, ఇప్పుడు రూ.15వేల వరకూ కట్టాల్సి వస్తోందన్నారు. అదనంగా చెల్లించాల్సిన డబ్బుకు డీడీ తీసినా ఒక టీటీపీఆర్‌ను తిరస్కరించారని చెప్పారు. సభ్యుడు ఎంఎల్‌ఎన్ సురేష్‌బాబు మాట్లాడుతూ ఒకే ఇంటికి రెండు వాటర్ ట్యాక్సులు వస్తున్నాయని, దీనిపై నాలుగేళ్లుగా అడుతున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. పురసేవ యాప్‌లో సమస్యలు పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు చూపుతున్నారని మండిపడ్డారు.
47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్‌కుమార్ మాట్లాడుతూ అస్తవ్యస్తంగా కొళాయి కనెక్షన్లు ఇస్తున్న అమృత్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. నగరంలో రోడ్ల మధ్యలో ఏర్పాటు చేస్తున్న లాలిపాప్ బోర్డులకు ఏ నిధులను ఉపయోగించారో చెప్పాలని పట్టుబట్టారు. ప్రతిదీ కలెక్టర్ ఆదేశాల మేరకే అధికారులు పనిచేస్తున్నారని, ఇక్కడ పాలకవర్గం ఒకటుందని గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. పాలకవర్గం 11 తీర్మాణాలు ప్రవేశపెట్టగా ఒకటి మాత్రమే అమలు జరిగిదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment