కడప: వైఎస్‌ఆర్ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు కలిగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడే ముందు పార్టీ ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి తన పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో మంత్రి తత్తరపాటుకు గురయ్యారు. ఫిరాయింపు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు విఫలయత్నం చేశారు. రాజీనామా అంశాన్ని ప్రశ్నించడంతో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఫిరాయింపు జెడ్పీటీసీలు బల్లలు చరుస్తూ టీ కప్పులు పగలగొట్టారు.
రసాభాసగా సమావేశం
జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే...ఇది దానికి వేదిక కాదంటూ మంత్రులు చెప్పడం రచ్చకు దారి తీసింది. ఒక దశలో మంత్రి సోమిరెడ్డికి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గృహనిర్మాణంపై రాచమల్లు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రులు సమాధానం చెప్పలేక శాసనసభలో చర్చిద్దామంటూ దాటవేసే ధోరణి అవలంభించారు. అంతేకాక రాచమల్లు ప్రసాదరెడ్డి అర్బన్ ఏరియాకు చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఈ మీటింగుకు రాకూడదని ఎదురుదాడి చేశారు. దీంతోవైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నేలపై కూర్చుని తమ నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment