నిధుల్లేక నీరసిస్తున్న స్థానిక సంస్థలు  | Minister jupally comments over local companies | Sakshi
Sakshi News home page

నిధుల్లేక నీరసిస్తున్న స్థానిక సంస్థలు 

Published Wed, Nov 1 2017 3:05 AM | Last Updated on Wed, Nov 1 2017 3:05 AM

Minister jupally comments over local companies

సాక్షి, హైదరాబాద్‌: నిధుల్లేక స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు పెట్టారు. దీంతో తాము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి సడక్‌ యోజన అమలు, ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పనులకు సంబంధించి సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,318 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.601 కోట్లే విడుదల చేశారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. నిధుల్లేక గ్రామ పంచాయతీలు బలహీనపడిపోతున్నాయని టీఆర్‌ఎస్‌ సభ్యుడు భూపాల్‌రెడ్డి చెప్పారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నాలుగు జిల్లా పరిషత్‌ సమావేశాలకు వెళ్లొస్తే వాస్తవం తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు.

సర్పంచులు, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని కాంగ్రెస్‌ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వాపోయారు. 14వ ఆర్థిక సంఘంలో మార్పుల వల్ల నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు పోతున్నాయని, దీంతో మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు రావట్లేదని టీఆర్‌ఎస్‌ సభ్యుడు భానుప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇస్తున్నట్లే జిల్లా పరిషత్‌లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని టీఆర్‌ఎస్‌ సభ్యుడు భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, పాత చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధికి త్వరలోనే సమగ్ర పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.

2015–17 కాలంలో స్థానిక సంస్థలకు రూ.1,146.94 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు గ్రామ పంచాయతీలకే వెళ్తున్నాయని, మండల, జిల్లా పరిషత్‌లకు రావట్లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో పంచాయతీ రహదారులు ఘోరంగా ఉన్నాయని షబ్బీర్‌ అలీ విమర్శించగా.. మంత్రి జూపల్లి బదులిస్తూ 20–30 ఏళ్లలో చేసిన దానికంటే ఒక్క ఏడాదిలోనే వేల కోట్ల రూపాయల పనులు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర మంత్రులు జోక్యం చేసుకోవడంతో షబ్బీర్‌ అలీ మండిపడ్డారు. ‘సంబంధిత మంత్రికి జవాబు ఇవ్వడం రాదా? లేదా ఆయన శాఖ ఏమైనా మారిందా?’అంటూ విరుచుకుపడ్డారు. 

పాత పెన్షన్‌ పద్ధతిని పునరుద్ధరించాలి.. 
కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) స్థానంలో పాత పద్ధతిని పునరుద్ధరించాలని టీఆర్‌ఎస్‌ సభ్యుడు జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్‌ వల్ల ఉద్యోగుల అభద్రతా భావంతో బతుకుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ థియేటర్లలో తినుబండారాల ధరలు 6 నుంచి 10 రెట్లు అదనంగా ఉంటున్నాయని, వీటిని కట్టడి చేయాలని సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. చౌక దుకాణాల్లో బియ్యం తప్ప వేరే ఇవ్వడం లేదని, దీంతో వేలాది మంది డీలర్లకు కనీస కమీషన్లు కూడా రావట్లేదని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, గ్రూప్‌–1 ఫలితాలను నిలుపుదల చేయడంపై వాయి దా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని షబ్బీర్‌అలీ కోరగా.. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ తిరస్కరించారు.  

ఉస్మానియా భూముల లీజుకు రూపాయా?: ప్రభాకర్‌రావు
ఉస్మానియా వర్సిటీలో కొన్ని భూములను ఏడాదికి ఎకరం రూపాయికే లీజుకు ఇవ్వడంపై ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. కొందరికి ఎకరానికి రూపాయి, ఇంకొందరికి రూ.40, మరికొందరికి రూ.50 లక్షలకు లీజుకు ఇచ్చారని, వ్యత్యాసమెందుకు ఉందన్నారు. 24 ప్రభుత్వ, తదితర సంస్థలకు 187.5 ఎకరాలు లీజుకు ఇచ్చామని కడియం శ్రీహరి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 4 సంస్థలు లీజుకు అడగగా, వాటికి లీజు రేట్లను పెంచే ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

ప్రజలకు అందుబాటులో పెట్రోల్‌ బంకుల టాయిలెట్లు
పెట్రోల్‌ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని మంత్రి కె.తారకరామారావు అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో టాయిలెట్ల పరిస్థితిపై పలువురు అడిగిన ప్రశ్నలపై మంత్రి మాట్లాడుతూ పెట్రోల్‌ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు ఉపయోగపడేలా వాటి యాజమాన్యాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఒప్పించామని చెప్పారు. కాగా, రాష్ట్రంలో 1,152 మంది అనాథ పిల్లలున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. అందులో 37 మందికి బీసీ–ఎ సర్టిఫికెట్‌ ఇచ్చామని  ఆయన చెప్పారు. 

సరైన స్థలంలోనే కలెక్టరేట్ల నిర్మాణం: తుమ్మల 
ప్రజామోదం లేకుండా ఎక్కడా కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మండలిలో హామీ ఇచ్చారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ కోసం అనువైన ప్రదేశం ఎంపిక చేయలేదని భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కలెక్టరేట్ల స్థలాల మంజూరుపై బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ మార్పుపై పొంగులేటì ప్రశ్నించారు. నిర్మల్‌లో కొండ మీద స్థలంపై విమర్శలు రావడంతో శంకుస్థాపన చేయలేదని తుమ్మల పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement