నువ్వెంత అంటే నువ్వెంత!
♦ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే రేవంత్ వాగ్వాదం
♦ శిలాఫలకానికి గులాబీ పరదా విషయంలో గలాట
♦ బాబుపై జూపల్లి వ్యాఖ్యలకు రేవంత్ అభ్యంతరం
♦ టీఆర్‌ఎస్, టీడీపీ కార్యకర్తల నినాదాలు.. పోలీసుల లాఠీచార్జి
కోస్గి: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలంలో గురువారం జరిగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో రభస చోటుచేసుకుంది. శిలాఫలాకానికి గులాబీ పరదా వేయడాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలపడం.. మరో సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి వ్యాఖ్యలు చేస్తుండగా మైక్‌ను లాక్కునేందుకు యత్నించడంతో గందరగోళం నెలకొంది. ఒక దశలో మంత్రి, ఎమ్మెల్యే ‘నువ్వెంతంటే.. నువ్వెంత’ అని వాగ్వాదం చేసుకున్నారు. వివరాలు.. కోస్గి మండలంలో మంత్రి జూపల్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట అమ్లికుంట్లలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న క్రమంలో శిలాఫలకానికి గులాబీ పరదాను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను పిలిచి ‘ఇది ప్రభుత్వ కార్యక్రమమా.? పార్టీ కార్యక్రమమా?’అని ప్రశ్నించడంతో అక్కడే ఉన్న మంత్రి జూపల్లి రంగుదేముందిలే! అని నచ్చజెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. బోగారంలో బీటీ రోడ్డును ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో జూపల్లి మాట్లాడుతూ పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు ఆనాడు తెలంగాణను రాకుండా అడ్డుకున్నారని, ఈరోజు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎవరు అడ్డుకున్నా ప్రాజెక్టులను కట్టి తీరుతామంటుండ గా.. రేవంత్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రజల సమావేశంలో రాజకీయాలు ఎందుకని మైక్‌ను లాక్కునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా గొడవ ప్రారంభమైంది. చంద్రబాబు ఇచ్చే మూటల కోసం పని చేస్తున్నావని మంత్రి, జగన్‌తో కుమ్మక్కై ప్రా జెక్టుల పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని రేవంత్ పరస్పర ఆరోపణలు చేసుకున్నా రు. పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం మంత్రి సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.