సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగం పనితీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమెకు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలోని వాస్తవ పరి స్థి తులను కేంద్ర మంత్రికి ఆయన వివరించారు.
గత సర్కారు నిర్లక్ష్యంతో విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం..
► గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలో విద్యుత్ రంగం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంది. ఈ కారణంగా డిస్కంలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వం వచ్చే నాటికి విద్యుత్తు ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.20 వేల కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. డిస్కంలు రూ.27 వేల కోట్ల మేరకు నష్టాలు ఎదుర్కొన్నాయి. వాటి అప్పుల పరిమితినీ దాటిపోయాయి. గత ప్రభుత్వం అత్యధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసిన కారణంగా ఏటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు రెవెన్యూ లోటు ఏర్పడింది.
► గత ప్రభుత్వం విద్యుత్తు రంగంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. డిస్కంలకు సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా అవి అప్పులపై నడిచేలా వ్యవహరించింది. 31 మార్చి 2019 నాటికి విద్యుత్ రంగంలోని అన్ని కార్పొరేషన్ల అప్పులు రూ.70 వేల కోట్లుగా ఉన్నాయి.
అధిక ధరకు కొనాల్సి వస్తోంది..
► ఎస్‌ఈసీఐ, ఎన్టీపీసీ తదితర కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి తక్కువలో తక్కువ 1 కేడబ్ల్యూహెచ్‌కు రూ. 2.70 చొప్పున రాష్ట్రం విద్యుత్ కొనుగోలు చేస్తున్న వాస్తవంతో మేం ఏకీభవిస్తున్నాం. అయితే ఇది కేవలం విద్యుత్ కొనుగోలు ధర మాత్రమే. దీనికి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు.. సరఫరా, పంపిణీ వ్యయాలు అదనంగా ఉంటాయి.
► పునరుత్పాదక విద్యుత్ విషయంలో బ్యాలెన్సింగ్ చార్జీలు, గ్రిడ్ ఇంటిగ్రేషన్ చార్జీలూ ఉంటాయి. వినియోగదారులకు విద్యుత్ చేరేసరికి వాస్తవ కొనుగోలు ధర కంటే ఎక్కువ వ్యయమవుతోంది.
► ఏపీ విద్యుత్ నియంత్రణ సంస్థ 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన విద్యుత్ సరఫరా సగటు వ్యయం కేడబ్ల్యూహెచ్‌కు రూ.6.87. విద్యుత్తు సరఫరాకు ఇలా ఎం దుకు అధిక వ్యయం అవుతోందంటే..
1)ఎన్టీపీసీ కుడ్గీ నుంచి అత్యధికంగా రూ.9.44 చొప్పున వెచ్చించి రాష్ట్రం బలవంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది.
2) పవర్ గ్రిడ్ సంస్థ అంతర్రాష్ట్ర విద్యుత్తు పంపిణీ కోసం వసూలు చేస్తున్న రేట్లు ఆంధ్రప్రదేశ్ విషయంలో దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఒక మెగావాట్ పంపిణీకి రూ.5.5 లక్షలు వసూలు చేస్తోంది. అదే ఇతర రాష్ట్రాల్లో రూ.లక్ష మాత్ర మే. దీనిపై కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం అనేకసార్లు విన్నవించినా ఉపశమనం లభించలేదు. ఈ కారణంగా పవర్‌గ్రిడ్‌కే ఏటా రూ.1,700 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అయినా వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా టారిఫ్ పెంచలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగానికి సరఫరా చేసిన విద్యుత్ టారిఫ్ గరిష్టంగా రూ.7.45 మాత్రమే కానీ రూ.9 కాదు. ఈ టారిఫ్ కూడా ప్రస్తుత ప్రభుత్వం పెంచింది కాదన్న విషయం గమనించాలి.
ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కాపాడుతోంది..
► ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కాపాడేందుకు ఎన్నో చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్ చెల్లింపులుసహా రూ.17,904 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందించింది.
► విద్యుత్ రంగంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది.
► రాష్ట్రంలో గ్రీన్‌కో గ్రూప్ 550 మెగావాట్ల పవన విద్యుత్, 1,000 మెగావాట్ల సౌరవిద్యుత్, 1,680 మెగావాట్ల రివర్స్‌పంపింగ్ ప్రాజెక్టు పెట్టేందుకు ప్రతిపాదించింది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రతిపాదనను సమర్పించగా.. రాష్ట్రానికి మరింత మేలు చేసే షరతులతో ఇప్పుడు అమలులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ఈ సంస్థ మరో ప్రాజెక్టును అమలు చేసేందుకు ముందుకొచ్చింది.
..వారే తప్పుడు సమాచారం ఇస్తున్నారు
టీడీపీ అధిష్టానంతో సన్నిహితంగా ఉండే ఆ పార్టీ నేతలు కొందరు గతంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిత్యం దూషించారు. టీడీపీ అధికారం కోల్పోవ డంతోనే అనైతికంగా బీజేపీలో చేరిన ఈ నేతలు వ్యక్తిగత, రాజకీయ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరుపై తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాష్ట్రం గురించి ఒక అభిప్రాయాన్ని తీసుకునే ముందు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment