మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు | MLA Anantha Comments On Opposition Leader Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు

Published Fri, Nov 15 2019 6:02 AM | Last Updated on Fri, Nov 15 2019 6:02 AM

MLA Anantha Comments On Opposition Leader Chandrababu Naidu - Sakshi

పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

సాక్షి, అనంతపురం : ఇసుక పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్నది దొంగదీక్ష అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్‌ సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనది 40 ఏళ్ల అనుభవమనీ, 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని, పదేళ్ల ప్రతిపక్ష నేతగా ఉన్నానని గొప్పలు చెప్పే వ్యక్తి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా..? అని ప్రశ్నించారు. గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు ఉనికి కోసమే ఇసుక రాజకీయం చేస్తున్నారన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ క్రమంలో నీటమునిగిన రీచ్‌లలోని ఇసుకను ఎలా తీస్తారో ఆయనే చెప్పాలన్నారు. అసలు వర్షాలు కురిసే సమయంలో ఎక్కడైనా నిర్మాణాలు జరుగుతాయా..? అని ప్రశ్నించారు. ఆమాత్రం ఇంగితం లేకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ నేతలకు భవన నిర్మాణ కారి్మకుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే వారికి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాలి గానీ, రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు.
 
ఇసుకాసురులు టీడీపీ నేతలే 
ఇసుక, మట్టిని దోపిడి చేసిన నీచమైన చరిత్ర టీడీపీ నాయకులేనని ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేసి భారీగా దోపిడీ చేశారన్నారు. ఇసుక అక్రమ రవాణాతో రాయదుర్గం, పెనుకొండ, హిందూపురం, తాడిపత్రి, శింగనమల, ధర్మవరం ప్రాంతాల్లోని టీడీపీ ప్రజాప్రతినిధులు రూ.కోట్లు గడించారన్నారు. ఇలాంటి నీచమైన చరిత్ర ఉన్న వారు..ఇప్పుడు ఇసుకపై మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ తహసీల్దార్‌పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దౌర్జన్యం చేస్తే కనీసం కేసు నమోదు చేయలేదన్నారు. ఇసుక మాఫియాను ప్రోత్సాహించింది చంద్రబాబేనని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, అందువల్లే ఎక్కడ అక్రమ రవాణా జరిగిన కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలిచ్చారన్నారు. ఈ క్రమంలో మన జిల్లాలో 9 చోట్ల పోలీసు యంత్రాంగం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిందన్నారు. 

మంచి కనిపించడం లేదా బాబూ 
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన చేస్తున్నారన్నారు. ఆశావర్కర్ల జీతాలను రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచామన్నారు. సొంత ఆటో ఉన్న వాళ్లకు రూ. 10 వేలు అందించామన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు మొదటి విడత రూ. 10 వేల అందించామన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తామని చెప్పి అంతకుమించి రూ. 13,500 అందించామన్నారు. లక్షా 20 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కలి్పంచామన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 11 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇవన్నీ మంచి పనులు కావా..? అని ప్రశ్నించారు. ఇక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆ స్కూళ్ల ఫొటోలను పంపుతామని, చంద్రబాబు వాటిని దాచిపెట్టుకొని మూడేళ్ల తర్వాత అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూసుకోవాలన్నారు.  

మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు 
చంద్రబాబు ఆ పార్టీ నేతలు దద్దమ్మలనే గత ఎన్నికల్లో ఆ పార్టీని 23 స్థానాలకే ప్రజలు పరిమితం చేశారని ఎమ్మెల్యే అనంత అన్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు. రాజధాని పేరుతో దోపిడీ చేశారని, అమరావతిని గెజిట్‌లో కూడా పొందుపరచలేదన్నారు. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చంద్రబాబుతో కలిసి ఆయన ఎంత ఊగినా ఫలితం లేదన్నారు. వారి ఊపులకు ఎవరు భయపడరన్నారు. పవన్‌ పొలిటికల్‌ సినిమా ఫ్లాప్‌తో మూతపడిందన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాకు హంద్రీనీవా ద్వారా 2012 నుంచి ఏటా 30 నుంచి 35 టీఎంసీలు నీరు వస్తున్నా... ఒక్క ఎకరాకు నీరివ్వలేని దద్దమ్మలు మీరు కాదా అని ప్రశ్నించారు.

ఆ నీళ్లన్ని ఎక్కడికెళ్లాయో కూడా లెక్కలు లేవన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హంద్రీనీవాను 10 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు సమాంతర కాలువ తెస్తున్నట్లు చెప్పారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధి అని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు వస్తే టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారనీ, తాము అలా చేయమని స్పష్టంచేశారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికైనా విమర్శలు చేయడం, దొంగ దీక్షలు చేయడం మాని మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌మోహన్, మాజీ కార్పోరేటర్‌ చంద్రమోహన్‌రెడ్డి, జాన్సన్, సైఫుల్లా బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement