
సాక్షి, దొడ్డబళ్లాపురం: ఇచ్చిన మాట తప్పాడని ఎమ్మెల్యే కారుపై చెప్పులు విసిరిన సంఘటన శనివారం మధ్యాహ్నం కర్ణాటకలోని మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. శనివారం మాగడి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ గతంలో దళిత నేత రంగహనుమయ్య భార్యను మున్సిపల్ అధ్యక్షురాలిగా చేస్తానని మాటిచ్చారు. అనుకున్నట్టుగానే అధ్యక్ష స్థానం దక్కుతుందని దళిత నేత మద్దతుదారులతో తరలివచ్చాడు. తీరా ఎన్నికల సమయానికి చక్రం తిప్పిన ఎమ్మెల్యే బాలకృష్ణ కురుబ సామాజిక వర్గానికి చెందిన మంజునాథ్‌కు అధ్యక్ష స్థానం దక్కేలా చేశారు.
దీంతో ఆగ్రహించిన దళితులు ఎమ్మెల్యే బయటకు వచ్చి బయలుదేరే సమయంలో కారుకు వేసిన పెద్ద పూల హారాలు లాగివేయడంతోపాటు చెప్పులు విసిరారు. కారుకు అడ్డంపడి నినాదాలు చేశారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు. ఇదే సందర్భంగా దళితులు స్థానిక ఎంపీ డీకే సురేశ్‌తోపాటు మంత్రి రేవణ్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.