సాక్షి, అమరావతి : ప్రపంచ స్థాయి రాజధాని నగర నిర్మాణం అన్నారు.. రైతులకు మాయమాటలు చెప్పి పంట భూములను లాక్కున్నారు. పచ్చని పైర్లతో కళకళలాడే భూములు.. ఏడాదికి మూడు పంటలను ఇచ్చిన భూములు... ఇప్పుడు పశువులను మేపుకునే పచ్చి గడ్డి మైదానాలుగా మారిపోయాయి. వెరసి ఇంతకాలం అన్నం పెట్టిన తమ భూములకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి చుట్టు పక్కల వేల ఎకరాల పంట భూముల ప్రస్తుత పరిస్థితి ఇది. ఇంతకీ ఇక్కడ ఠీవీగా మేస్తూ కనిపిస్తున్న గేదెలు ఎవరివో కాదు.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెందినవి. అమరావతికి వెళ్లే క్రమంలో ఆయన పనిలో పనిగా ఏలూరులో తన పశువుల కొట్టంలోని 118 గేదెలను వెంటపెట్టేసుకొచ్చేశారు. రెండు నెలలుగా ఇక్కడ ఈ తంతు కొనసాగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పనివాళ్లను.. దొడ్డిని నిర్మించటం విశేషం. చింతమనేని ఆదేశాల మేరకే తాము దగ్గరుండి వాటిని చూసుకుంటామని పనివాళ్లు చెప్పటం గమనించదగ్గ అంశం.
చంద్రబాబు ఆధునిక నగర నిర్మాణ గొప్పల సంగతి తెలియదు కానీ... ప్రస్తుతం పశుగ్రాసానికి మాత్రం అమరావతి భూములు కేరాఫ్ అడ్రస్‌గా మాత్రం మారాయి. అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే పనిలో పనిగా, రైతుల భూముల్లో నెమరు వేస్తున్న తన పశువులను చూసుకుని తెగ సంబరపడుతున్నారు.
ఇది కూడా చంద్రబాబు ఘనతేనా?
సాక్షి, విజయవాడ : రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను కూడా చంద్రబాబు ఘనతే అని టీడీపీ నేతలు చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు అంటున్నారు. సింగపూర్ ను తలదన్నెలా రాజధాని నిర్మాణమని ఘనంగా ప్రకటించుకుని.. ఇప్పుడు ఆ భూములను గడ్డి మైదానాలుగా మార్చేసిన ఘనత మాత్రం నిజంగా చంద్రబాబుదేనని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతిలో గడ్డి పుష్కలంగా దొరుకుతుందని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని చెబుతున్నారని.. చివరకు త్యాగం చేసి రైతులు ఇచ్చిన భూములు పశువుల మేతకు నిలయంగా మారే దుస్థితి పట్టిందని సుధాకర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment