సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి కారణంగా జిల్లా రైతులు రూ.400 కోట్లు నష్టపోయారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. వెంకటాచలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంతమేరకు ధాన్యం కొనుగోలు చేశారని సిబ్బందిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఒక్క బస్తా ధాన్యం కూడా కొనుగోలు జరగలేదని బదులిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయశాఖ మంత్రిగా రైతులకు సోమిరెడ్డి ఏమి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైసుమిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేశారన్నారు. మిల్లర్ల వద్ద నుంచి తీసుకున్న ముడుపులు వెంటనే వెనక్కి ఇవ్వకుంటే రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. జిల్లాలో 20 లక్షల పుట్ల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా ఉండగా ఒక్కో పుట్టిపై రైతులు రూ.2వేల వంతున నష్టపోయారని తెలిపారు. ఆ లెక్కన సోమిరెడ్డి అవినీతి కారణంగా రైతులు రూ.400 కోట్లు నష్టపోవడం జరుగుతుందన్నారు. వెంకటాచలంలో గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదంటే కేంద్రాల వల్ల రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలుగుతుందో ఇట్టే అర్థమౌతుందన్నారు. వెంకటాచలం నుంచి కావలి రైసుమిల్లుకు రైతులు ధాన్యాన్ని తరలించాలని చెప్పడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు రావడంలేదన్నారు. కూతవేటు దూరంలో ఉన్న నెల్లూరు రైసుమిల్లలు కాదని, కావలి రైస్‌మిల్లులను కేటాయించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
చర్చకు రావాలని సవాల్
జెడ్పీ చైర్మన్‌గా తాను ఉన్నప్పుడు ఏమీ అభివృద్ధి చేయలేదని మంత్రి సోమిరెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు సరైనవికావన్నారు. సోమిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జిల్లాలో ఏ మారుమూల గ్రామానికి పిలిచినా తాను వస్తానని చెప్పారు. బహిరంగ చర్చలో ఎవరు ఏం చేశారో తేలిపోతుందన్నారు. మంత్రిగా రెండు దఫాలు చేసినా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయావని, తాను జెడ్పీ చైర్మన్‌గా చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. మంత్రిగా ఉంటూ విమర్శలు చేసి మౌనంగా ఉండటం సరికాదన్నారు. వాస్తవాలు తెలియాలంటే చర్చకు రావాలన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, మండల కో–ఆప్షన్‌సభ్యుడు హుస్సేన్, వైఎస్సార్ సీపీ నాయకులు అడపాల ఏడుకొండలు, డేగా శ్రీనివాసులు, నరసయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment