అవినీతిలో నంబర్‌వన్ సోమిరెడ్డి: కాకాని
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి నెల్లూరు జిల్లాలో కొండెక్కి కూర్చుందని, అవినీతిలో ఆయన జిల్లాలోనే నంబర్‌వన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమిరెడ్డి విదేశీ లావాదేవీలు, అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందు పెట్టడంతో పాటు, సీబీఐ, ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)కు అందజేశామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు రాసిన లేఖను ఆయన విడుదల చేశారు. నిజంగా ఎమ్మెల్సీకి ధైర్యం ఉంటే సీబీఐ, ఈడీ విచారణలు ఎదుర్కోవాలని కాకాని సవాలు విసిరారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అవకతవకలపై నిజాల నిగ్గు తేల్చాలని దర్యాప్తు సంస్థలను కోరాల్సింది పోయి.. అవి ఫోర్జరీ డాక్యుమెంట్లు అని సోమిరెడ్డి నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఆ తరువాత డీజీపీని కలవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డీజీపీ దగ్గరకు వెళ్లిన వారు సీబీఐ దగ్గరకు ఎందుకు వెళ్లరని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి..: చంద్రబాబు సోమిరెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని కాకాని డిమాండ్ చేశారు. తనపై సోమిరెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు బయట పెట్టాలని, అలా కాకుండా అడ్డదిడ్డంగా మాట్లాడి అధికారంతో బయటపడాలని నీచమైన పనిచేస్తే ప్రజలు ఛీకొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. తనపై పరువు నష్టం కేసు వేస్తానని సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ... ఆయనపై తాము గనుక పరువునష్టం కేసు వేస్తే విదేశాల్లో ఉన్న ఆయన నల్లడబ్బు కూడా కట్టడానికి చాలదన్నారు. సోమిరెడ్డి పేరుతో ఒక విద్యుత్ ప్రాజెక్టు, ఆయన సతీమణి జ్యోతి పేరుతో 3 కంపెనీలు, కొడుకు పేరుతో 10 కంపెనీలున్నాయని కాకాని తెలిపారు. కుటుంబ ఆస్తులన్నీ అమ్ముకున్నానని, తన తండ్రి ఇచ్చిన ఇల్లు తప్ప ఏమీ లేదన్న సోమిరెడ్డికి ఇన్ని కంపెనీలు, ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని తాను ప్రశ్నిస్తే సమాధానం దాట వేస్తున్నారని కాకాని మండిపడ్డారు.