సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రతో సీఎం చంద్రబాబుకు మతి భ్రమించిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో నేడు పాదయాత్ర ముగుస్తున్న సందర్భంగా ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కృష్ణా జిల్లాలో 228 కిలోమీటర్లు వైఎస్ జగన్ పాదయాత్ర సాగింది. జిల్లాలో జననేత కొన్ని కీలకమైన హామీలిచ్చారు. 4800 ఎకరాల్లోనే బందరు పోర్ట్ నిర్మిస్తామన్నారు. మత్స్యకారులకు ప్రమాద పరిహారం రూ. 10 లక్షలకు పెంచుతామన్నారు. అంతేకాక కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్నారు. ఇప్పటి వరకు 8 జిల్లాలో పాదయాత్ర ముగిసింద’ని పెద్దిరెడ్డి తెలిపారు.
చంద్రబాబు వైఫల్యానికి ప్రతీక వైఎస్ జగన్ పాదయాత్ర అని, బాబుకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను రూ.2.26 లక్షల కోట్ల అప్పుల్లో టీడీపీ ప్రభుత్వం ముంచేసిందని పెద్దిరెడ్డి విమర్శించారు. ఏది నిర్మించకుండానే ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసారని ఆయన ధ్వజమెత్తారు. బాబు పాలనలో రైతులు 92 శాతం మంది అప్పులో మునిగిపోయారన్నారు. డ్వాక్రా మహిళలకు 2 ఏళ్ల నుంచి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగలివ్వకుండా మోసం చేశారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
రెండు కళ్ళ సిద్ధాంతాలను నమ్మే చంద్రబాబు.. ఇప్పుడు టీటీడీ పాలకమండలిలో మహారాష్ట్ర మంత్రి భార్యను నియమించారని ఎద్దేవా చేశారు. బీజేపీతో బాబు లాలూచీకి ఇంతకంటే నిదర్శనం ఏంటి అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలపై పోటీకి పెడతానని అంటున్నారని, ఉప ఎన్నికలొస్తే చంద్రబాబు రెఫరెండంగా తీసుకోవాలని పెద్దిరెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు చేయించిన సర్వేలో 30 మంది ఎమ్మెల్యేలకు మించి గెలవరని తేలింది ఆయన పేర్కొన్నారు.
బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు ఏపీకి తీరని ద్రోహం చేశారని విరుచుకుపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాళ్లు వేయించి.. ఒప్పుకునే ధైర్యం కూడా బాబుకు లేదన్నారు. ‘మా ఎంపీలపై చంద్రబాబు పోటీ చేస్తే.. మేం గెలిస్తే రాజీనామా చేయాలని’ పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. అంతేకాక ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment