ఉమ్మడి నల్లగొండ జిల్లా విభజనలో భాగంగా నాలుగు నియోజకవర్గాలతో నూతన జిల్లాగా సూర్యాపేట ఆవిర్భవించింది. ఇందులో జిల్లా కేంద్రంగా ఉన్న సూర్యాపేట నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిదన్నది ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతా ఎదురుచూస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్వల్ప మెజారిటీతో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గ చరిత్రలో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయింది కూడా ఆయనే. పట్టణానికి మూసీ మురుగు నీళ్లే తాగునీరు. ఇవెంత శుద్ధి చేసినా తాగలేని పరిస్థితి. మిషన్ భగీరథతో కృష్ణాజలాలను సూర్యాపేటకు రప్పించే పనులకు ట్రయిల్ రన్ పూర్తయింది. ఇవి ప్రభావం చూపనున్నాయి. పార్టీ, ప్రభుత్వపరంగా ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న జగదీశ్‌రెడ్డి.. ప్రస్తుత ఎన్నికల్లో తాను గెలవడంతో పాటు మిగతా స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే సవాల్‌ను ఎదుర్కొంటున్నారు.
సిట్టింగ్ ప్రొఫైల్
2001లో టీఆర్‌ఎస్ సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2001లో సిద్దిపేట, 2003లో మెదక్, 2004లో మెదక్, సిద్దిపేట ఉప ఎన్నికల సమయంలో పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అలాగే 2006లో కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక, 2008లో ముషీరాబాద్, ఆలేరు స్థానాల ఉప ఎన్నికలకు ఇన్‌చార్జిగా ఉన్నారు. 2009లో సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటూ పార్టీ తరఫున హుజూర్‌నగర్ స్థానం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత 2011లో బాన్సువాడ, 2012లో కొల్లాపూర్ ఉప ఎన్నికలకు పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సూర్యాపేట నుంచి విజయం సాధించడంతో తెలంగాణ తొలి మంత్రివర్గంలో చోటు దక్కింది. విద్యాశాఖ మంత్రిగా తొలుత బాధ్యతలు ఇచ్చారు. ఆ తర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న ఆయన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పని చేశారు.
మళ్లీ వారితోనే ‘ఢీ’..
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా సంకినేని వెంకటేశ్వరరావు, టీడీపీ నుంచి పటేల్ రమేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి జగదీశ్‌రెడ్డి పోటీ చేశారు. జగదీశ్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో సంకినేనిపై విజయం సాధించారు. ఈసారి జగదీశ్‌రెడ్డి (టీఆర్‌ఎస్), దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్), సంకినేని వెంకటేశ్వరరావు (బీజేపీ) మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరికి వారు తమదే విజయం అన్న ధీమాలో ఉన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో విజయం సాధిస్తే.. ఈ సారి అభివృద్ధి మంత్రంతో తనదే గెలుపన్న నమ్మకంతో జగదీశ్‌రెడ్డి ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యాపేట పట్టణంలో పలు పార్టీల కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరడం, నాలుగు మండలాల్లో ఇతర పార్టీల కేడర్ గులాబీ బాట పట్టడం వంటివి తనకు కలిసొస్తాయని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి: కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడం, దళితులకు మూడెకరాల పంపిణీ సరిగా అమలు కాకపోవడం వంటి వాటిపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. సంకినేని వెంకటేశ్వరరావు: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చలవతోనే రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ పలు అభివృద్ధి పనులు జరిగాయని, వాటిని టీఆర్‌ఎస్ తనవిగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.
అభివృద్ధి హంగులు
మెడికల్ కాలేజీ నిర్మాణానికి
రూ.500 కోట్లు మంజూరు
మూసీ, పాలేరు వాగులపై చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.120 కోట్లు
రూ.378 కోట్లతో మిషన్ భగీరథ పనులు
జిల్లా కేంద్రంలో రూ.42 కోట్లతో నూతన భవన నిర్మాణాలు
మురుగు నీటి ప్లాంట్‌కు రూ.81 కోట్లు
మూసీ ప్రాజెక్టు ఆ«ధునీకరణకు రూ.79 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.109 కోట్లు
రూ.20 కోట్లతో ఆధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణం
ప్రధాన సమస్యలు
పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది
ఆటోనగర్, పారిశ్రామికవాడ నిర్మాణం కోసం ఎదురుచూపు
నిరుద్యోగ సమస్య.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే యువతకు ఉపాధి
సూర్యాపేటలో కలగా డిగ్రీ కళాశాల
-ఇన్‌పుట్స్: బొల్లం శ్రీను
Comments
Please login to add a commentAdd a comment