పెట్టుబడులు, ఉద్యోగ సృష్టిపై దృష్టి | Modi government to set up cabinet committees on investment, employment | Sakshi
Sakshi News home page

పెట్టుబడులు, ఉద్యోగ సృష్టిపై దృష్టి

Published Thu, Jun 6 2019 4:30 AM | Last Updated on Thu, Jun 6 2019 4:43 AM

Modi government to set up cabinet committees on investment, employment - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు దేశచరిత్రలోనే తొలిసారిగా రెండు కేబినెట్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో మొదటిదైన ‘పెటుబడులు, అభివృద్ధి కేబినెట్‌ కమిటీ’లో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, పీయూష్‌గోయల్‌లను సభ్యులుగా నియమించారు. భారత్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆర్థికవ్యవస్థ వృద్ధిపై కమిటీ దృష్టి సారించనుంది. అలాగే ఉద్యోగకల్పన–నైపుణ్యాభివృద్ధిపై ఏర్పాటైన కేబినెట్‌ కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, సీతారామన్, పీయూష్‌ గోయల్, నరేంద్రసింగ్‌ తోమర్, రమేశ్‌ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంఎన్‌ పాండే, సంతోష్‌ కుమార్‌ గంగ్వార్, హర్దీప్‌ పురీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ దేశంలో కొత్త ఉద్యోగాల సృష్టితో పాటు యువత ఉపాధి పొందేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడంపై దృష్టి పెట్టనుంది.
 
 ఈ రెండు కేబినెట్‌ కమిటీలు ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేస్తాయి. ఈ రెండు కమిటీలను ఏర్పాటుచేసేందుకు నిబంధనలు అనుమతిస్తున్నప్పటికీ ఎన్డీయే–1 ప్రభుత్వం వీటిని ఏర్పాటుచేయలేదు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విపక్షాలు ప్రధాని మోదీని దేశంలో నిరుద్యోగం, ఆర్థికవ్యవస్థ మందగమనంపై తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఈసారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా చేసేందుకు మోదీ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. మరోవైపు దేశభద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీని బుధవారం ఏర్పాటుచేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రక్షణ, హోం, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు.

ప్రకృతితో మమేకమైతే ఉజ్వల భవిష్యత్‌
ప్రకృతితో మమేకమై సామరస్యంగా జీవించడం ఉజ్వల భవిష్యత్‌కు నాంది పలుకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్‌ 5) సందర్భంగా ఆయన అందరికి శుభాకాంక్షలు చెప్పారు. ‘భూమి, పర్యావరణం.. మనం పరిరక్షించుకోవాల్సిన గొప్ప అంశాలు ఇవి. ప్రపంచ పర్యావరణ దినోత్సవమైన నేడు స్వచ్ఛమైన భూమి కోసం కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నా’ అంటూ ట్విట్టర్‌లో ప్రధాని ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. మొక్కల్ని నాటడం గొప్ప విషయం కాదనీ, అవి చెట్లుగా మారేవరకూ పరిరక్షించాలని మోదీ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్‌ 21) సమీపిస్తున్న వేళ యోగాను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న మోదీ.. తాను ఆసనాలు వేస్తున్నట్లు ఉన్న యానిమేషన్‌ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఢిల్లీ, సిమ్లా, మైసూరు, అహ్మదాబాద్, రాంచీలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

రంజాన్‌ శుభాకాంక్షలు..
రంజాన్‌(ఈద్‌–ఉల్‌–ఫితర్‌) పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్‌ పర్వదినం మన సమాజంలో సామరస్యం, కరుణ, శాంతిని పెంపొందిస్తుందని ఆశిస్తున్నా. ప్రతీఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement