నయవంచకుడు చంద్రబాబు | Mohan Babu Fires On Chandrababu In Election Campaign | Sakshi
Sakshi News home page

నయవంచకుడు చంద్రబాబు

Published Mon, Apr 1 2019 5:48 AM | Last Updated on Mon, Apr 1 2019 5:48 AM

Mohan Babu Fires On Chandrababu In Election Campaign - Sakshi

పెజ్జోనిపేట వద్ద రోడ్‌షోలో మాట్లాడుతున్న సినీనటుడు మోహన్‌బాబు

పూర్ణానందంపేట (విజయవాడ పశ్చిమ):  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నయవంచకుడని, హత్యలు చేయించేందుకు వెనుకాడడని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయవాడ 48వ డివిజన్‌ పెజ్జోనిపేట రోడ్డు షోలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల వేళ చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో మహిళలను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడన్నారు. నాలుగున్నరేళ్లకు పైగా మహిళలను పట్టించుకోని ఆయన కేవలం ఎన్నికల కోసం ఈ పథకం పెట్టాడని విమర్శించారు.

టీడీపీ చంద్రబాబుది కాదని, మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడని, కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంతగా వైఎస్సార్‌సీపీని స్థాపించారని చెప్పారు. అంతరిస్తున్న పార్టీ టీడీపీ అని.. వెలుగుతున్న పార్టీ వైఎస్సార్‌సీపీ అన్నారు. లక్షల కోట్లు డబ్బున్న పార్టీ టీడీపీ అన్నారు. చంద్రబాబుకు కులపిచ్చి అని, తనకు అటువంటిది లేదని చెప్పారు. అన్నికులాలు తనకు సమానమన్నారు.

టీడీపీ పాలనలో వేల కోట్ల అవినీతి తప్ప అభివృద్ధి లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారని విశ్వాసం వ్యక్తం  చేశారు. నాడు వైఎస్సార్‌ ప్రభుత్వంలో ప్రతి పేదవాడూ ఉన్నత చదువులు చదువుకునే వారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని, దీనికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే విద్యార్థులకు మంచి రోజులు వస్తాయన్నారు.

వైఎస్సార్‌సీపీ పశ్చిమ అసెంబ్లీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ను 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని, విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. వెలంపల్లి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్‌ బండి నాగేంద్రపుణ్యశీల, కార్పొరేటర్లు బుల్లా విజయ్‌కుమార్, జమల పూర్ణమ్మ, నాయకులు పైలా సోమినాయుడు, సంగీత్‌బాబు, సుజాత, శరత్‌బాబు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement