
దక్షిణ నియోజకవర్గంలోని లక్ష్మీ టాకీస్ జంక్షన్‌లో జరిగిన రోడ్‌షోలో మాట్లాడుతున్న సినీనటుడు మోహన్ బాబు. చిత్రంలో ఎం.వి.వి.సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్
చంద్రబాబు నాయుడు నీచుడు..గజదొంగ..దొంగల పార్టీకి అధినేతని విలక్షణ నటుడు మోహన్‌బాబు ఆరోపించారు.
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): చంద్రబాబు నాయుడు నీచుడు.. గజదొంగ.. దొంగల పార్టీకి అధినేతని విలక్షణ నటుడు మోహన్‌బాబు ఆరోపించారు. తప్పు చేస్తున్న చంద్రబాబును ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైంది. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అన్న ఎన్టీఆర్‌నే మోసం చేసిన మహా ఘనుడు చంద్రబాబని మండిపడ్డారు. అబద్దాల కోరు చంద్రబాబుకు ఓటు వేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. వంగి వంగి నమస్కారాలు చేస్తున్న ద్రోహిని సాగనంపాలంటూ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆరిలోవ, దక్షిణ నియోజకవర్గ పరిధి 25వ వార్డు లక్ష్మీటాకీస్ జంక్షన్, మధురవాడలలో నిర్వహించిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్, భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌లను గెలిపించాలని కోరారు. అంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఎక్కడ చూసినా జగన్.. జగన్ అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్నారన్నారు. చంద్రబాబు నయవంచకుడు, పరమ దుర్మార్గుడని విమర్శించారు. పిల్లను ఇచ్చిన మామను చంపిన నీచుడని దుయ్యబట్టారు. చంద్రబాబుతో 40 ఏళ్లపాటు తనకు స్నేహం ఉందని, అందుకే ఆయన నీచపు బుద్ధి నాకు తెలుసన్నారు.
ప్రజా సంక్షేమం ఘనత వైఎస్సార్‌దే..
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుచేసి పేద యువత ఇంజనీరింగ్ చదువుకోవానికి సహకరించారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుచేసి పేదలకు మెరుగైన వైద్యం అందించారన్నారు. యువత జాగ్రతగా గుర్తుపెట్టుకొని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటేయాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రి అయితే యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఉన్నత చదువులకు అవకాశం కలుగుతుందన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలన్నారు. వైఎస్సార్ చేసిన మంచిపనులు గుర్తించి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో అభ్యర్థులతోపాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫారూఖి, వార్డు అద్యక్షుడు సూరాడ తాతారావు, వార్డు నాయకులు సూరాడ అప్పారావు, షబీర బేగం అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.