
సాక్షి, భైంసా(అదిలాబాద్): భైంసాలో ఎంఐఎం పార్టీ గూండాలు సాగించిన హింసాకాండ అధికార పార్టీ టీఆర్‌ఎస్ అండదండలతోనే జరిగిందని ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఎంఐఎం, టీఆర్‌ఎస్ పార్టీలు హింసాత్మక ఘటనలకు తెరతీశాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది కోసం ఎంఐఎం అరాచకాలకు టీఆర్‌ఎస్ వంత పాడుతుందని విమర్శించారు. భైంసాలో మున్సిపాలిటీని ఎంఐఎంకు ఏకగ్రీవంగా కట్టబెట్టేందుకు టీఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పనుకుని కుట్రలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే.. ప్రజలు రజాకార్ల పాలనను చూడాల్సి వస్తుందన్నారు. వీరోచిత పోరాటం, అమరుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో తిరిగి రజాకార్ల పాలన వచ్చే ముంపు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణ కావాలో... రజాకార్ల పాలనా కావాలో నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.
(చదవండి: తెల్లారినా అదే పరిస్థితి.. 144 సెక్షన్ విధింపు)
భైంసాలో ఓ వర్గానికి చెందిన దుండగులు హిందువులకు చెందిన 18 ఇళ్లను దగ్ధం చేశారని, పెద్ద సంఖ్యలో ప్రజలను గాయపరిచారని మండిపడ్డారు. ఆస్తులను, వాహనాలను తగలబెట్టారని, దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైనా గూండాలు విరుచుకుపడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులపైనే ఎంఐఎం గుండాలు దాడులకు పాల్పడితే... శాంతి భద్రతలను ఎవరు పర్యవేక్షిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భైంసా ఘటనలో పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని, పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు అప్రమత్తత పాటించలేదని విమర్శించారు.
దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే భయపడతామనుకుంటే పొరపాటని, దాడులను ప్రతిఘటిస్తూ.. ఎలాంటి ఉద్యమాలైనా చేపట్టానికి తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ సవాలు విసిరారు. భైంసా ఘటనను వ్యతిరేకిస్తూ.. హిందూ సమాజం ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భైంసాలో పోటీ నుంచి తప్పుకుని ఎంఐఎం పార్టీకి మున్సిపాలిటీని అప్పగించాలని చూస్తున్న టీఆర్‌ఎస్.. భవిష్యత్తులో అధికారం నుంచి తప్పుకుని ఎంఐఎంకు పాలనను అప్పగిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్టంలో సాగుతున్న అరాచక పాలనపై టీఆర్ఎస్ నేతల శ్రేణులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని, అధినాయకత్వాన్ని ప్రశ్నించాలని ఆయన హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment