![MP Keshava Rao Speech In Telangana Bhavan - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/28/keshav-rao.jpg.webp?itok=n3YY10xZ)
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముఖ్యమైనవి కాబట్టి.. వాటిపై అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించామని టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల విజయంపై తాము సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఓ కీలక తీర్మాణం కూడా తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ, నీతి ఆయోగ్ నిధులు విడుదలపై పోరాడాలని నిర్ణయించుకున్నట్టు కేశవరావు పేర్కొన్నారు.(ఢిల్లీ పార్టీలు.. సిల్లీ పనులు)
విభజన హామీలు ఆరేళ్లుగా అమలు చేయకుండా కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని కేశవరావు విమర్శించారు. వాటి అమలు కోసం కచ్చితంగా పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారని గుర్తుచేశారు. జాతీయ గణనలో ఓబీసీని కూడా చేర్చాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. దేశ ఎకానమీ తగ్గుదలపై, సీఏఏ లాంటి అంశాలను పార్లమెంట్‌లో ప్రధానంగా ప్రస్తావిస్తామని వెల్లడించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటోందని ఆయన ఆరోపించారు. రేపు(బుధవారం) అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ అంశాలను చేర్చాలని కోరుతామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 95శాతం విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దొరకడం తెలంగాణకు అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఎన్నో పథకాలు మిగతా రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో చాలా పెండింగ్ పనులు ఉన్నాయని.. వాటిని కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని.. ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment