రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవమని చెప్పుకునే చంద్రబాబుతో 40 ఏళ్ల వయసున్న వైఎస్ జగన్ ఈ ఐదేళ్లలో అనేక పిల్లిమొగ్గలు వేయించాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జగన్ వ్యూహాలను, నిర్ణయాలను వారు అభినందిస్తున్నారు. తాజాగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విశ్లేషిస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను, వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని పలు అంశాలను చంద్రబాబు కాపీ కొట్టారని సోషల్ మీడియాలో తీవ్ర చర్చజరుగుతోంది.
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ అజెండాను సెట్ చేసినా.. చంద్రబాబు దాన్ని పాటిస్తూ వచ్చారని ప్రముఖ రాజకీయ విళ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. జగన్ ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకుంటే.. ప్యాకేజీ ముద్దు అని అన్న చంద్రబాబు కూడా చివరకు యూటర్న్ తీసుకొన్నారని చెప్పారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ సభ్యులు బయటకు రావాల్సిందనేని జగన్ పట్టుబడితే.. చంద్రబాబు దాన్ని పాటించారని గుర్తు చేశారు. ఇలా జగన్ ఏ అజెండా నిర్ణయిస్తే.. చంద్రబాబు దాన్ని ఫాలో అవుతూ వచ్చారన్నారు.
అజెండాను సెట్ చేసే వాళ్లే లాభపడతారు
’ఎవరైతే రాజకీయాల్లో అజెండా సెట్ చేస్తారో వాళ్లు లాభపడతారు. ఎవరైతే ఆ అజెండాకు స్పందిస్తుంటారో వాళ్లు నష్టపోతుంటారు. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది అదే. మోదీ అజెండాను సృష్టిస్తూ వచ్చారు.. ప్రత్యర్థులందరూ దానిపై ప్రతిస్పందిస్తూ వచ్చారు. ఫలితమేమైంది? మోదీకి లాభం జరిగింది. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఉద్యమ కాలంలో కేసీఆర్ అజెండాను సృష్టిస్తే.. ఇతర పార్టీలు ఆ అజెండాను పాటిస్తూ వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది కూడా అదే. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అజెండాను సెట్ చేస్తున్నాడు.. దానికి సీఎం చంద్రబాబు రియాక్ట్ అవుతున్నాడు. ఇందుకు నేను ఐదు ఉదాహరణలు చెబుతాను.
జగన్ హోదా కోసం నినదిస్తే.. బాబు ఫాలో అయ్యాడు
మొదటిది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని మొదట్నుంచీ ఊరూవాడా తిరిగిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. ఆ సమయంలో చంద్రబాబు ఏమని వాదన పెట్టాడు? ‘అసలు ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ బాగుంటుంది. ప్రత్యేక హోదా మంచిదని చెప్పిందెవరు? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా? ప్రత్యేక హోదా వస్తే ఏదో మూడు, నాలుగు వేల కోట్లు వస్తాయి? అంతకు మించి ఒరిగేదేముంది?’ అని చంద్రబాబు వాదించాడు. ప్రత్యేక ప్యాకేజీ బాగుందని ప్రకటనలు చేయడమే కాకుండా.. వెంకయ్యనాయుడికి సన్మానాలు కూడా చేశారు. ఆ తర్వాత ఏమైంది? జగన్ తన పాదయాత్రలో ప్రత్యేక హోదా డిమాండ్‌నే వినిపించారు. జగనే కాదు.. ఇతర విపక్ష రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను పట్టుకునే పోరాడాయి. దీంతో చంద్రబాబు తప్పనిసరై ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. కానీ అప్పటికే హోదా కంటే ప్యాకేజీ మంచిదని చెప్పిన వ్యక్తిగా చంద్రబాబు అపప్రద మూటకట్టుకున్నాడు. చంద్రబాబే కదా.. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నది. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకుంటే ఎలా? అని బీజేపీ కూడా ప్రశ్నిస్తోంది. రాజకీయంగా చంద్రబాబుకు ఇది పెద్ద సెట్‌బ్యాక్‌గా మారిపోయింది.
జగన్ డిమాండ్ చేస్తే.. కేంద్రం నుంచి వైదొలిగారు
ఇక రెండో ఉదాహరణ. జగన్ మొదట్నుంచీ ఒక మాట అంటున్నాడు.. ‘ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ.. మోదీ మంత్రివర్గంలో సభ్యులుగా ఉంటూ బీజేపీతో ఎలా పోరాడగలరు? మొదట ఎన్డీఏ నుంచి, కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రండి’ అని జగన్ డిమాండ్ చేస్తూ వచ్చాడు. ‘కేంద్రంలో మీరే(ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ ఉన్నప్పుడు) బడ్జెట్‌ను ఆమోదిస్తారు? ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారనని మళ్లీ మీరే అంటుంటారు’ అని చంద్రబాబుపై జగన్ దాడి చేశారు. అప్పుడు చంద్రబాబు ఏమన్నారు? ‘కేంద్ర మంత్రివర్గంలో ఉంటేనే కదా కొద్దోగొప్పో నిధులు తీసుకురాగలం. బీజేపీ ప్రభుత్వమేమీ మాపై ఆధారపడి లేదు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగితే తప్పేంటి’ అని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. కానీ, ఆ తర్వాత జరిగిందేంటి? కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ సభ్యులు వైదొలిగారు. వైఎస్ జగన్ డిమాండ్ చేసిన మొదట్లోనేమో.. కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. చివరకు కేంద్రం నుంచి వైదొలిగి జగన్ డిమాండ్‌ను చంద్రబాబు అమలు చేశారు.
ఇదేమి రాజకీయమని ప్రశ్నిస్తే.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు
ఇక మూడోది. ‘మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు సరే.. ఎన్డీఏలో కొనసాగడమేమిటి? ఇదేమి రాజకీయం’ అంటూ చంద్రబాబుపై మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శలు చేశారు. దానికి చంద్రబాబు, టీడీపీ వాళ్లు ఏం బదులిచ్చారు? ‘ఎస్. బీజేపీకి, మోదీకి ఇంకా అవకాశమిస్తున్నాం. ఇప్పుడైనా.. వాళ్లు మనసు మార్చుకుని ఏపీకి సాయం చేస్తారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ చివరకు ఏమైంది? జగన్ కోరినట్లుగానే టీడీపీ వాళ్లు ఎన్డీఏకు కూడా గుడ్‌బై చెప్పేశారు.
అవిశ్వాసంలోనూ అనుసరణే..
ఇక నాలుగోది అవిశ్వాసం. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని జగన్ టైం టేబుల్ ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు.. ‘అసలు అవిశ్వాసానికి బలం ఉందా? అవిశ్వాసం అంటే జోక్ అనుకున్నారా? అనేక పార్టీల మద్దతు కూడగట్టాలి? ఈ అవిశ్వాసంతో బీజేపీ ప్రభుత్వం పడిపోతుందా? అలా పడిపోనప్పుడు అవిశ్వాసం దేనికి? దాని వల్ల లాభమేమిటి?’ అని ప్రశ్నించాడు. కానీ, జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కి తగ్గకుండా అవిశ్వాసం పెడతామని స్పష్టం చేశారు. ‘టీడీపీ వాళ్లు అవిశ్వాసం పెడితే దానికి కూడా మద్దతు ఇస్తాం.. లేదా మేము పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండి’ అని జగన్ పిలుపిచ్చాడు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ఎంపీలు అవిశ్వాసానికి నోటీసిచ్చారు. ఆ నోటీసు ఇచ్చిన కొద్ది రోజులకు చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తాం’ అని ప్రకటించారు. కానీ ఆ మరుసటి రోజుకు సీన్ అంతా మారిపోయింది. ‘జగన్ కేంద్రంతో లాలూచీ పడుతూ అవిశ్వాసం పెడుతున్నాడు. ఆయనకు మేమెందుకు మద్దతిస్తాం. అసలు మేమే అవిశ్వాసం పెడతాం’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ముందేమో అసలు అవిశ్వాసంతో లాభమేమిటి? అని ప్రశ్నించిన చంద్రబాబు.. చివరకు మేమే అవిశ్వాసం పెడతామంటూ అనేక వంకర్లు తిరిగారు. అయినా అవిశ్వాసం ముందు పెట్టింది ఎవరు? వైఎస్సార్‌సీపీ. ఆ తర్వాతే టీడీపీ పెట్టింది. అంటే ఎవరు ఎవర్ని అనుసరించినట్టు?
Comments
Please login to add a commentAdd a comment