
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాలకు దిశ దశను నిర్దేశించే విధంగా టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీ ఉంటుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదిక వద్ద మీడియా సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు.
అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ ఎన్నో అవమానాలను, ఆటుపోట్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిందని అన్నారు. టీఆర్‌ఎస్‌ది సెక్యులర్ ప్రభుత్వమని, తెలంగాణలో అన్నివర్గాలు సామరస్యంగా జీవిస్తున్నాయని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామాకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని, వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని నాయిని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోబోమని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ పార్టీ కాళ్ల కింద భూమి కదులుతోందని అన్నారు. ప్రధాని మోదీ మీద భ్రమలు తొలగిపోయాయని, కాంగ్రెస్, బీజేపీల తీరు చూసే దేశంలో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు.
దేశంలోనే నంబర్ వన్: మహమూద్ అలీ
తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలను దేశం అంతటా ఆదరణ లభిస్తున్నదన్నారు. ఏ రాష్ట్రం వెళ్లినా ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను, తెలంగాణ అభివృద్ధిని కొనియాడుతున్నారని చెప్పారు.
రైతులకు రూ.12 వేల కోట్లతో పెట్టుబడి సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ఇది రైతు ప్లీనరీ అని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రదర్శించబోయే సాంస్కృతిక కార్యక్రమా లకు రిహార్సల్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. కొంపల్లిలోని గార్డెన్‌లో మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్ కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment