
చినకొండూరు నియోజకవర్గం నుంచే కొండా లక్ష్మణ్‌బాపూజీ చట్టసభల్లోకి ప్రవేశించారు. అయితే, ఈ నియోజకవర్గం ఇప్పుడెక్కడుందా అని డౌటొచ్చిందా? మునుగోడు నియోజకవర్గం పేరు 1967కు ముందు చినకొండూరు.
ప్రస్తుత కొడంగల్ నియోజకవర్గం 1952లో ద్విసభ్య నియోజకవర్గం. 1962లో మద్దూరుగా పేరు మార్చుకుని ఎస్సీ రిజర్వుడు అయింది. 2009లో కొండగల్‌గా పేరు మార్చుకుంది.
కార్వాన్‌ది వేరే కథ. 1952 తొలి ఎన్నికల నాటికి కార్వాన్ నియోజకవర్గంగానే ఉంది. 1967లో సీతారాంబాగ్‌గా మారింది. మళ్లీ 2009లో కార్వాన్‌గా తన పూర్వ నామాన్ని సుస్థిరం చేసుకుంది.
ధర్మసాగర్, వేంసూరు, సీతారాంబాగ్, ఆసిఫ్‌నగర్, దొమ్మాట, పెద మునగాల, చినకొండూరు, మేడారం, ఆత్మకూరు, అమరచింత... ఈ పేర్లన్నీ ఎక్కడో విన్నట్టుందా?! గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా..? గుర్తొచ్చాయా...? గుర్తుకొస్తే సరి.. లేదంటే చదవండి.. ఇవన్నీ మన పాత అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు. 1952 నుంచి 2009 వరకు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఇవన్నీ పేరు మారి కొత్త పేర్లు పెట్టుకున్నాయి. కొన్నిచోట్ల పేర్లే కాదు... రిజర్వేషన్లు కూడా మారాయి.
నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడల్లా ఒక స్థానంలో ఉన్న మండలాలు మరో చోటుకు మారడం సహజమే కానీ, పేరు మారడం తక్కువే. అప్పటివరకు ఉన్న నియోజకవర్గం పేరు కనుమరుగైపోవడం చాలా రోజులు అక్కడి ప్రజలకు జీర్ణమయ్యేది కూడా కాదు. పేరు మారిందంటే చాలు.. పాత పేరు కలిగిన మండల కేంద్రమో లేదా గ్రామమో అన్ని రంగాల్లో వెనుకబడిపోతుందనే భయం ఉండేది. కొత్త నియోజకవర్గంగా ఏర్పడ్డ చోట అభివృద్ధి జరుగుతుందనే ఆశ పుట్టేది. ఇందులో వాస్తవమెంత ఉన్నా... పేరు మార్చుకున్న నియోజకవర్గాల గురించి తెలుసుకుందాం. ఆ పాత నియోజకవర్గాల ‘కథా కమామిషు..’
♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం 1972కు ముందు పాల్వంచ పేరుతో ఉండేది. ఇప్పటికీ కొత్తగూడెం–పాల్వంచ.. హైదరాబాద్ – సికింద్రాబాద్‌లా కలిసే ఉంటాయి.
♦ 2009 తర్వాత ఎస్సీ కోటాలో ఏర్పడిన సత్తుపల్లి నియోజకవర్గం అంతకుముందు జనరల్ నియోజకవర్గమే. అప్పుడు వేంసూరు పేరుతో ఉండేది.
♦ ఎస్టీ రిజర్వుడుగా ఉన్న ఇల్లెందు నియోజకవర్గానిది గతంలోనూ అదే పేరు. కానీ అప్పుడు జనరల్ సీటు
♦ వరంగల్ (తూర్పు) 2009కు ముందు వరంగల్ పేరుతోనే నియోజకవర్గంగా ఉండేది.
♦ వరంగల్ (పశ్చిమ) నియోజకవర్గం 1972కు ముందు హసన్‌పర్తి పేరుతో ఉండేది. అంతకు ముందు దానిపేరు ధర్మసాగర్.
♦ పరకాల నియోజకవర్గానిది ఆది నుంచీ అదే పేరు. 1972కు ముందు జనరల్ స్థానం. ఆపై ఎస్సీ రిజర్వుడు అయింది. మళ్లీ 2009లో జనరల్‌గా మారింది.
♦ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం 1972కు ముందు జనరల్ స్థానమే. ఆ తర్వాత ఎస్సీకి మారిన ఈ స్థానం 2009 పునర్విభజనలోనూ ఎస్సీ రిజర్వుడు స్థానంగానే ఉండిపోయింది.
♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు.. రిజర్వేషన్లు మారడం అలవాటుగా మార్చుకుంది. ఇది 72కు ముందు జనరల్ స్థానం. ఆ తర్వాత ఎస్సీ రిజర్వుడు అయింది. మళ్లీ 2009లో జనరల్‌కు మారింది.
♦ తుంగతుర్తి పేరు 1967కు ముందు నాగారం. ఇది ప్రస్తుత ఆపద్ధర్మ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి స్వగ్రామం.
♦ మిర్యాలగూడ నియోజకవర్గం 1957కు ముందు పెదమునగాలగా ఉండేది.
♦ నాగార్జునసాగర్ స్థానం 1962కు ముందు పెద్దవూర పేరుతో ఉండేది. ఆ తర్వాత చలకుర్తి అయింది. 2009లో నాగార్జునసాగర్‌గా మారింది.
♦ మక్తల్.. 1952లో ద్విసభ్య నియోజకవర్గం. మక్తల్, ఆత్మకూరు పేరుతో ఈ నియోజకవర్గం కొనసాగింది.
♦ దేవరకద్ర.. 1962కు ముందు ఆత్మకూరు..2009 వరకు అమరచింత.. 2009లో దేవరకద్ర అయింది.
♦ 2009కు ముందు ఆసిఫ్‌నగర్ పేరు నాంపల్లి.
♦ అంబర్‌పేట నియోజకవర్గం 1972 వరకు గగన్‌మహల్ పేరుతో ఉండేది. 72 తర్వాత హిమాయత్‌నగర్ అయింది. 2009లో అంబర్‌పేటగా మారింది.
♦ దుబ్బాక నియోజకవర్గం తొలిపేరు రాజగోపాల్‌పేట. తర్వాత దొమ్మాట అయింది. 2009లో దొమ్మాట రద్దయి దుబ్బాక నియోజకవర్గం ఏర్పడింది.
♦ పఠాన్‌చెరు నియోజకవర్గం 2009 వరకు రామాయంపేటగా ఉండేది.
♦ హుస్నాబాద్ స్థానం 1962 నుంచి కమలాపురంగా ఉండేది. 2009లో రద్దయి హుస్నాబాద్ ఏర్పడింది.
♦ మానకొండూరు.. 2009 వరకు నేరెళ్లగా కొనసాగింది.
♦ రామగుండం నియోజకవర్గం పేర్లు, రిజర్వేషన్లు మార్చుకోవడం పరిపాటి. 1962 వరకు మేడారం పేరుతో జనరల్ సీటు. ఆ తర్వాత అదే పేరుతో ఎస్సీ రిజర్వుడు అయింది. మళ్లీ 2009లో రామగుండంగా పేరు మార్చుకుని జనరల్ కోటాలోకి మారింది.
♦ ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గం 2009 వరకు ఇందుర్తి (జనరల్)గా ఉండేది.
♦ బుగ్గారం. 2009లో రద్దయి కోరుట్లగా మారింది.
♦ నిజామాబాద్ (రూరల్) పాతపేరు డిచ్‌పల్లి. 2009లో కొత్త పేరు వచ్చింది.
♦ నిజామాబాద్ (అర్బన్) మొదటి నుంచీ నిజామాబాదే.. 2009లో అర్బన్ నియోజకవర్గమయింది.
♦ జుక్కల్ (ఎస్సీ) పేరు అదే కానీ... 2009కు ముందు జనరల్ కోటాలో ఉండేది.
♦ ప్రస్తుత మంచిర్యాల 2009కు ముందు లక్సెట్టిపేట.
- మేకల కల్యాణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment