బాలకృష్ణతో నారా లోకేశ్(పాత ఫొటో)
సాక్షి, అమరావతి: అదోరకం హాస్యాన్ని పంచడంలో అందరికంటే ముందుండే మంత్రి నారా లోకేశ్.. మరోసారి వేసేశారు! ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని ఆయన..‘‘పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి రెడీ..’’ అన్నారు. మరునిమిషంలోనే నాలుకకరుచుకుని...‘‘ఆగండాగండి.. ఒక్క హిందూపురంలో తప్ప ఏ సీటైనా ఒకే’’ అని సవరించుకున్నారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బాలయ్యతో గొడవలు పెట్టకండి: రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీచేసి గెలిచే సత్తా తనకుందని లోకేశ్ చెప్పుకొచ్చారు. ‘‘చంద్రబాబు గారు ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ పోటీచేస్తా. కానీ ఒక్క హిందూపురం జోలికి మాత్రం వెళ్లను. ఎందుకంటే అక్కడ మా మామగారు అద్భుతంగా పనిచేస్తున్నారు. వచ్చేసారి కూడా ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారు. అలాంటప్పుడు నేను అక్కడికెళ్లి చేసేది ఏముంటుంది? ముమ్మాటికీ నేను హిందూపురం నుంచి పోటీ చేయనుగాకచేయను. దయచేసి మా మామ బాలకృష్ణకు నాకు మధ్య గొడవలు పెట్టాలని చూడొద్దు..’’ అని లోకేశ్ అన్నారు.
ముందస్తుకు ఒప్పుకోను: దేశమంతటా ముందస్తు ఎన్నికల జపం చేస్తున్నవేళ ఏపీ మంత్రి లోకేశ్ ఒకింత భిన్నంగా స్పందించారు. డిసెంబర్‌లోగా ముందస్తు ఎన్నికలొస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు! కనీసం డిసెంబర్ తర్వాతే ఎన్నికలు జరపాలని సూచించారు. ఒకవేళ మోదీ గనుక ముందస్తుకు వెళితే, బీజేపీతో టీడీపీ కలవదని, ప్రజా తీర్పు ప్రకారం తాము మాత్రం ఐదేళ్లూ అధికారంలో ఉంటామని చినబాబు వివరించారు.
మోదీతో కేటీఆర్ భేటీపైనా వ్యంగ్యాస్త్రాలు: తెలంగాణ సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు సహకరించాలని అభ్యర్థించడం తెలిసిందే. అయితే, మోదీ-కేటీఆర్ భేటీపై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు వేశారు. ‘‘ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లినా ముఖ్యమంత్రులకే మోదీ అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. అలాంటిది (కేటీఆర్ పేరును ప్రస్తావించకుండా) ఇవాళ జరిగింది చూస్తే.. వాళ్లు(బీజేపీ) ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతుంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న విమర్శలు సరికావు’’ అని లోకేశ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment