సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమవంతు సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన ప్రజాచైతన్య సభకు మోదీ హాజరై ప్రసంగించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, సౌత్‌కోస్ట్ రైల్వే జోన్‌తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మోదీ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తనపై విషప్రచారం చేస్తున్నారని, విశాఖను స్మార్ట్ సిటీగా మార్చడం కోసం వేలకోట్ల రూపాయలను వెచ్చించామని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత విస్తరిస్తామని, స్థానిక ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పించిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
ప్రియమైన సోదరీసోదరమణులారా అంటూ మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డకు రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన విశాఖ రైల్వేజోన్ కానుకను ఇవ్వడానికి విశాఖ వచ్చానని పేర్కొన్నారు. సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. అధికార టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న యూటర్న్‌లు దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా తీసుకోలేదన్నారు. ఆయన పాలనతో అవినీతి పెరిగిపోవడం మూలంగానే కేంద్ర ప్రభుత్వమంటే భయపడుతున్నారని విమర్శించారు. దోచుకున్న డబ్బును దాచుకోవడానికే తనను ఓడించాలని చంద్రబాబు దేశమంతా తిరుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే భావసారుప్యత లేని నాయకులంతా కూటమి కడుతున్నారని, దాని వల్ల కేంద్రంలో బలమైన ప్రభుత్వం వచ్చే అవకాశం లేదన్నారు. ప్రపంచ దేశాలన్ని పాకిస్తాన్ తప్పుచేసిందని అంటుంటే కొంతమంది మాత్రం దేశాన్ని కించపరిచేలా మట్లాడుతున్నారని మోదీ మండిపడ్డారు. వారి మాటలతో భారత సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. పీఎం కిసాన్ పథకం ద్యారా ఏపీలో 88 లక్షల మంది రైతులకు మేలు చేకూరిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ది చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సాకారం తప్పక ఉండాలని మోదీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment