సిమ్లా : రాఫెల్ రగడ ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని అంత తేలిగ్గాం వదలడం లేదు. ఈ క్రమంలో పంజాబ్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరోసారి రఫెల్ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్ధు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 ఎన్నికల నాటికి గంగా పుత్రుడుగా ఉన్న నరేంద్ర మోదీ 2019 నాటికి రాఫెల్ ఏజెంట్‌గా మారిపోయారని ఆరోపించారు. అంతేకాక రాఫెల్ డీల్ విషయంలో ‘నరేంద్ర మోదీ బ్రోకరేజ్ తీసుకున్నారా లేదా అనే అంశాన్ని వదిలేస్తాను. అయితే ఈ విషయం గురించి దేశంలో ఎక్కడైనా సరే నాతో బహిరంగ చర్చకు మోదీ సిద్ధమా’ అని సిద్ధు ప్రశ్నించారు.
అంతేకాక రాహుల్ గాంధీ ఓ ఫిరంగి అని తాను ఏకే 47 గన్ను లాంటి వాడినని పేర్కొన్నారు సిద్ధు. నరేంద్ర మోదీ చెప్పే ‘తినను.. తిననివ్వను’(అవినీతి గురించి) వ్యాఖ్యలపై ఎక్కడైనా ఎప్పుడైనా తాను చర్చకు సిద్ధమే అంటూ చాలెంజ్ చేశారు సిద్ధు. ఒక వేళ ఈ సవాలులో తాను ఓడిపోతే.. ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు సిద్ధు.
Comments
Please login to add a commentAdd a comment