పోలవరానికి చంద్ర‘గ్రహణం’..! | The NDA Government Announced Polavaram as a National Project లnd Chandrababu Came to the Fore | Sakshi
Sakshi News home page

పోలవరానికి చంద్ర‘గ్రహణం’..!

Published Fri, Mar 29 2019 9:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:38 AM

The NDA Government Announced Polavaram as a National Project లnd Chandrababu Came to the Fore - Sakshi

సాక్షి, అమరావతి : జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా...వైఎస్‌ దుర్మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఎగిసిపడటంతో పోలవరానికి జాతీయ హోదా ప్రకటన ఆగిపోయింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. సీమాంధ్రులను చల్లార్చే క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. విభజన చట్టం సెక్షన్‌ 90 (1)లో పేర్కొన్నట్లు పూర్తి ఖర్చు భరిస్తామంది. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని జూన్‌ 14, 2014న ఏపీ ప్రభుత్వానికి లేఖ సైతం రాసింది.

కానీ, దీనికి చంద్రబాబు మోకాలడ్డుతూ వచ్చారు. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే, సత్తా లేని ట్రాన్స్‌ట్రాయ్‌పై కేంద్రం వేటు వేయడం ఖాయమని చంద్రబాబు భావించడమే దీనికి కారణం. మరోవైపు మారిన రాజకీయ పరిణామాలతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రానికి లేఖలు రాస్తూ వచ్చారు. కోరుకున్న మేరకు సెప్టెంబరు 7, 2016న రాష్ట్ర సర్కారుకు బాధ్యత దక్కింది. అనంతరం 24 గంటల్లోనే హెడ్‌వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.4,054 కోట్ల నుంచి రూ.5,585.41 కోట్లకు పెంచేసి రాయపాటి సంస్థకు రూ.1,481 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.2240.68 కోట్ల నుంచి రూ.4375.66 కోట్లు, ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.1954.74 కోట్ల నుంచి రూ.3645.15 కోట్లకు పెంచేస్తూ డిసెంబర్‌ 6, 2016న మరో ఉత్తర్వు జారీ చేశారు.

బాధ్యత తీసుకుని చంద్రబాబు బలాదూర్‌
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ఈ ప్రాజెక్టుకు ఓ విధంగా చెప్పాలంటే గత 58 నెలలుగా చంద్ర గ్రహణం పట్టింది. కేంద్రం నుంచి నిర్మాణ బాధ్యత దక్కించుకున్నాక చంద్రబాబు ప్రభుత్వం పనులను పరుగులు పెట్టించలేకపోయింది. ఈ వ్యవధి లో రూ.11,069.21 కోట్లు ఖర్చు చేసి కేవలం 22.36 శాతం పనులు చేయడమే దీనికి నిదర్శనం. 2018 నాటికి పాక్షికంగా పూర్తి చేసి గ్రావిటీపై ఆయకట్టుకు నీరందిస్తామని హామీ ఇచ్చిన ఆయన... సోమవారాన్ని పోలవారంగా పేర్కొని హడావుడి చేశారు. తీరా అదంతా ఒట్టి డాంబికమేనని తేలిపోయింది. 

వద్దన్నదే ముద్దా?
పోలవరం హెడ్‌వర్క్స్‌ చేయలేక కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో 2013లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలిచింది. రూ.4,054 కోట్లకు నాటి కాంగ్రెస్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ (జేవీ) సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థకు ప్రాజెక్టుల పనులు చేసిన అనుభవమే లేదని, అలాంటిదానికి ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ఎలా అప్పగిస్తారంటూ అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానానికి భారీగా ముడుపులు ముట్టడం వల్లే రాయపాటి సంస్థకు అప్పగించారని ఆరోపించారు. అయితే, 2014 ఎన్నికలకు ముందు రాయపాటి కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. దాంతో ట్రాన్స్‌ట్రాయ్‌ చంద్రబాబుకు ముద్దయింది.

వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి..
- 2016 సెప్టెంబరు 7,అర్ధరాత్రి 12.13 గంటలు: నిర్మాణ బాధ్యతలు దక్కడంతోనే ప్రాజెక్టు పూర్తి అయినంత స్థాయిలో చంద్రబాబు సంబరాలు నిర్వహించారు. 
- సెప్టెంబరు 12, 2016: ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సోమవారాన్ని... పోలవారంగా మార్చుకుని, వర్చువల్‌ రివ్యూలు నిర్వహిస్తానని ప్రకటించారు. తొలి రివ్యూతోనే పనులు వేగం పుంజుకున్నట్లు మాయ చేశారు.
- డిసెంబర్‌ 26, 2016: పోలవరానికి నాబార్డు ద్వారా రూ.1981.54 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన చెక్కును ఢిల్లీలో కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, నితిన్‌ గడ్కరీ అందించారు. దీంతోనే ప్రాజెక్టు పూర్తయిందనే రీతిలో ఢిల్లీ వేదికగా నాటకం ఆడారు.
- డిసెంబర్‌ 30, 2016: స్పిల్‌ వేలో కాంక్రీట్‌ పనులను ప్రారంభించారు. దీన్ని కాంక్రీట్‌ పండుగగా నామకరణం చేసిన చంద్రబాబు పనులు పూర్తయిన రీతిలో హంగామా చేశారు.
- ఫిబ్రవరి 1, 2017: ప్రాజెక్టుకు ఒకసారి శంకుస్థాపన చేసి పూర్తయ్యాక జాతికి అంకితం చేయడం సాధారణం. కానీ చంద్రబాబు పోలవరం గేట్ల తయారీ పనుల కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పునాది (డయాఫ్రమ్‌ వాల్‌) పనులకు పునాది రాయి వేశారు. 
- జూన్‌ 8, 2017: ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి, గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా చేపట్టే మట్టికట్ట (కాఫర్‌ డ్యామ్‌) పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాన ఆనకట్ట (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) çపూర్తయ్యాక కూల్చి వేసే కాఫర్‌ డ్యామ్‌తోనే నీరందిస్తామని ప్రకటించారు.  
- జూన్‌ 11, 2018: ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పునాది (డయా ఫ్రమ్‌ వాల్‌)ని జాతికి అంకితం చేసి ప్రాజెక్టు పూర్తయిన రీతిలో ప్రచారం చేసుకున్నారు.
- సెప్టెంబరు 12, 2018: స్పిల్‌ వేలో గ్యాలరీ వాక్‌ ప్రారంభించారు. దీంతోనే పనులు పూర్తయ్యాయనేలా భారీ ప్రచారం పొందారు.
- డిసెంబర్‌ 24, 2018: స్పిల్‌ వేలో 41వ గేట్‌ స్కిన్‌ ప్లేట్‌ అమర్చే పనులను ప్రారంభించారు. దీన్ని ఓ రికార్డుగా అభివర్ణించుకుని... పనులు మొత్తం పూర్తయ్యాయనే రీతిలో హంగామా చేశారు. ఆ గేటు ఇప్పటికీ గాల్లో వేలాడుతూనే ఉంది. 

మాటలకు చేతలకు పొంతనేది?
పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కిన రోజున అర్ధరాత్రే (సెప్టెంబరు 7, 2016) సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2018 నాటికే ప్రాజెక్టును పాక్షికంగా పూర్తి చేసి ఆయకట్టుకు నీరిస్తామన్నారు. ‘పోల వారం’ పేరిట ఇప్పటికి 90 సార్లు వర్చువల్‌ రివ్యూ లు, 29 సార్లు క్షేత్ర పర్యటనలు చేశారు. ఆ మేరకు ప్రగతి మాత్రం కన్పించలేదు.

  • జలాశయం పనుల్లో 11.69 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకానికి 9.73 కోట్ల క్యూబిక్‌ మీటర్లే చేశారు.
  • స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ (కాంక్రీట్‌ ఆనకట్ట) పనుల్లో 38.88 లక్షల క్యూ.మీ. కాంక్రీట్‌ పనులకు 26.28 లక్షల క్యూ.మీ. చేశారు. 
  • ప్రధానమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీ ఆర్‌ఎఫ్‌)కు పునాది పూర్తయింది. డ్యామ్‌ నిర్మించాలంటే నదీ ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదు గా మళ్లించాలి. ఎగువన, దిగువన కాఫర్‌ డ్యామ్‌ లు (మట్టి కట్టలు) నిర్మించాలి. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనుల్లో 72.56 లక్షల క్యూ.మీ.కు 21.51 లక్షల క్యూ.మీ. పనులు పూర్తయ్యాయి. మరో 51.05 లక్షల క్యూ.మీ. చేయాలి. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనుల్లో 26.84 లక్షల క్యూ.మీ.కు 4.47 లక్షల క్యూ.మీ. పనులు చేశారు.  ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు జూన్‌ రెండో వారంలోగా పూర్తి చేయాలి. లేదంటే వరద ప్రవాహానికి కొట్టుకుపోతాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రధాన జలాశయం ఈసీఆర్‌ఎఫ్‌ పనులు పునాది దశ దాటలేదని తేలుతోంది. దీంతో మే నెలకు పనులు పాక్షికంగా పూర్తి చేసి  ఆయకట్టుకు నీరిస్తామంటూ చంద్రబాబు మాట మార్చారు. పనుల తీరు పరిశీలిస్తే అది కూడా అసాధ్యమని స్పష్టమవుతోంది. 
  • కుడి కాలువ పనుల్లో 177.9 కి.మీ.కు 145 కి.మీ. పొడవునా లైనింగ్‌ సహా దివంగత సీఎం వైఎస్‌ పూర్తి చేశారు. మిగతావి ఇటీవల చేశారు. 
  • ఎడమ కాలువ పనుల్లో 210.92 కి.మీ.కు 134 కి.మీ. మేర దివంగత సీఎం వైఎస్‌ పూర్తి చేశారు. బాబు పాలనలో 58 నెలల్లో 51 కి.మీ. మేర మాత్రమే తవ్వగలిగారు.
  • పోలవరం జలాశయం పనులకు 1,66,423.27 ఎకరాల భూమికి 1,10,823.97 ఎకరాలు సేకరించారు. మరో 55,599.35 ఎకరాలు సేకరించాలి. జలాశయంలో ముంపునకు గుర య్యే 314 గ్రామాల్లోని 1,05,601 నిర్వాసిత కుటుంబాల్లో 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. పునరావాసం పనులు ప్రాథమిక దశ కూడా దాటలేదని దీంతో స్పష్టమవుతోంది. 
  • గత 58 నెలల్లో రూ.11,069.21 కోట్లను ఖర్చు చేసి 22.36 శాతం పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందులో రూ.6,727.26 కోట్లను కేంద్రం తిరిగి చెల్లించింది. ఇంకా రూ.4,341.95 కోట్లు ఇవ్వాల్సి ఉంది.

అంచనా వ్యయం పెంపులోనే ప్రగతి
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో ఏమైనా మార్పులు ఉంటే తెలపాలని పీపీఏ మొదటి సర్వసభ్య సమావేశంలోనే (మార్చి 12, 2015) అప్పటి సీఈవో... రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ..  ప్రభుత్వం రెండున్నరేళ్లు స్పందించలేదు. చివరకు ఆగస్టు 16, 2017న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.57,940.86 కోట్లకు పెంచుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. వాటిలో తీవ్ర తప్పిదాలు ఉండటంతో కేంద్రం విచారణ చేసి.. చివరకు రూ.55,385 కోట్లకు ఖరారు చేసి ఇటీవల సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది.  దీన్నిబట్టి చూస్తే అంచనా వ్యయం పెంచడంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి సాధించినట్లు స్పష్టమవుతోంది. 

చంద్రబాబు ఏం చేశారు?

  • వైఎస్‌ హయాంలో సైంధవుడిలా అడుగడుగునా అడ్డు తగిలారు..
  • విభజన అనంతరం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నారు.
  • 2018 నాటికే పూర్తి చేసి గ్రావిటీపై ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని ప్రకటించారు.
  • ప్రతి సోమవారం వర్చువల్‌ రివ్యూలు, క్షేత్ర స్థాయి పర్యటనలంటూ హడావుడి చేశారు.
  • అయినా ఇంకా పునాది స్థాయి దాటని ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ పనులు
  • ప్రాథమిక దశలోనే నిర్వాసితుల పునరావాసం
  • ఐదేళ్లలో రూ.11,069.21 కోట్లు ఖర్చు; 22.36 శాతం పనులే పూర్తి
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement