
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏపీ పోలీసులు సహకరించకపోవడంతో జాతీయదర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం కోర్టును ఆశ్రయించింది. ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇప్పించాలని ఎన్‌ఐఏ కోర్టులో మెమో దాఖలు చేసింది. అలాగే ఈ కేసును విజయవాడ కోర్టుకు బదలాయించాలని కోరింది. నిందితుడు శ్రీనివాసరావును కూడా కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం ఘటనమీద దర్యాప్తును హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్‌ఐఎ జనవరి 1న ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. విచారణలో భాగంగా ఏపీ పోలీసులు సహకరించకపోవడంతో ఎన్‌ఐఏ అధికారులు కోర్టును ఆశ్రయించారు.