
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు ప్రచారం కోసం, అధిష్టానం మెప్పుకోసం కార్యక్రమాలు చేయడం మాని, ప్రజల కోసం దీక్షలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. పసుపు బోర్డు కోసమో, కాళేశ్వరానికి జాతీయ హోదా కోసమో, రాష్ట్రానికి నిధుల కోసమో, పంటల మద్దతు ధర కోటా పెంపు కోసమో దీక్షలు చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారన్నారు. సీఎం కేసీఆర్ మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశారన్నారు. బీజేపీ నేతలు ఏ ప్రాజెక్టుకైనా కేంద్రం నుంచి మూడు రూపాయలు తెచ్చారా? ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడి సాధించిన ఒక్క పనైనా చూపాలన్నారు.