వీల్‌చైర్ లేకపోవడంతో తన అక్క నాగేంద్రమ్మను పోలింగ్ బూత్‌లోకి మోసుకెళ్తున్న రమేష్ , ఈ వయసులో తమకు ఓటు హక్కు లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వృద్ధులు గుప్త, జాన్ ఎండలో నిల్చోలేక కన్నీటి పర్యంతమవుతున్న బాలింత, తాగునీటి ప్యాకెట్ కోసం వెదుకుతున్న మహిళ
సాక్షి, అనంతపురం న్యూసిటీ: నగరంలోని వివిధ పోలింగ్ బూత్‌లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. కనీసం తాగునీరు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలు మండుటెండలో ఓటర్లు నరకం చూశారు. ఇక వృద్ధులు, ప్రమాదాలు జరిగి ఇబ్బందులు పడుతున్నవారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. 27వ డివిజన్ భాష్యం స్కూల్ 150, 151, 152వ బూత్‌లలో ర్యాంప్, మెట్లు పెద్దగా ఉండడంతో వృద్ధులు, మహిళలు, కాలు, చేయి విరిగిన వారు అవస్థలు పడ్డారు. 33వ డివిజన్ శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠశాలలో వీల్‌చైర్ సదుపాయం లేకపోవడంతో దివ్యాంగురాలు నాగేంద్రమ్మను తమ్ముడు రమేష్ ఎత్తుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటేయించాడు.
24వ డివిజన్ బుడ్డప్పనగర్ 230, 231, 232, 233 బూత్‌లలో వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు ఇబ్బందులు పడ్డారు. అదే బూత్‌లలో నీరు లేకపోవడంతో మహిళలు వాటర్ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. అరవిందనగర్ పోలింగ్ బూత్ 130, లా కళాశాల పోలింగ్ బూత్ 243, 244, 245, 246 బూత్‌లలో తాగునీరు, షామియాన ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఎండలోనే ఇబ్బంది పడ్డారు. బుడ్డప్పనగర్ 236 బూత్‌లో ఓ బాలింత ఎండలో నిల్చోలేక కన్నీటి పర్యంతమైంది. అదే డివిజన్‌లో బారికేడ్లు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో అవి కిందకు పడిపోయాయి. 242 బూత్‌లోనూ అదే పరిస్థితి. అగ్రికల్చర్ జేడీ ఆఫీస్ బూత్ నెంబర్ 242లో రెండు గంటల పాటు ఈవీఎంలు మొరాయించాయి. కేఎస్‌ఆర్ కళాశాల బూత్‌నెంబర్ 123లో ఈవీఎం మొరాయించడంతో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. బూత్ నెంబర్ 230లో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. బుడ్డప్పనగర్ పోలింగ్ బూత్ 236లో తన ఓటు లేదని గుప్తా అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు స్లిప్పు కోసం వెళితే మరో అడ్రస్ మార్చి తికమక చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయ స్కూల్‌లో జాన్ అనే వృద్ధుడు తన ఓటు గల్లంతైందని ఆవేదన వ్యక్తం చేశాడు.
► తలమర్లలో అర్ధరాత్రి వరకూ పోలింగ్
పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం తలమర్లలోని రెండో నంబర్ బూత్‌లో ఈవీఎం పలు దఫాలుగా మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అక్కడకు చేరుకుని అధికారులతో చర్చించారు. రీపోలింగ్ జరపాలని జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్‌తో పాటు స్థానిక ప్రిసెడింగ్ అధికారిని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. కొత్త ఈవీఎంలు సమకూర్చి రాత్రి 8 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. అర్ధరాత్రి వరకూ ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.
►బాలయ్యకు చుక్కెదురు
తనకు ఎదురు వచ్చిన వారిపై విచ్చణారహితంగా దాడి చేసే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను అదే నియోజకవర్గం గోళాపురం వాసులు బెంబేలెత్తించారు. వివరాల్లోకి వెళితే.. పోలింగ్ సరళిని పరిశీలిస్తూ.. గురువారం గోళాపురం గ్రామానికి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ సతీమణి సవిత మాధవ్ చేరుకున్నారు. ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతూ జై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. కొద్ది సేపటికి బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. పోలింగ్ బూత్‌ను పరిశీలించి బాలయ్య బయటకు రాగానే ఒక్కసారిగా గోళాపురం వాసులు జై జగన్ అంటూ ఆయనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి మధ్యలో నుంచి బాలయ్యను బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతి కష్టంపై బాలయ్య తన వాహనాన్ని ఎక్కి డోర్ వేసుకునే లోపు పలువురు వాహనంపైకి ఎక్కి బాలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, కిందకు దిగగానే.. అప్పటికే అవమాన భారంతో మండిపడుతున్న బాలయ్య.. ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు దూకించారు. వాహనం వేగానికి దుమ్ము ఎగిసిపడి కొద్ది సేపటి వరకూ రహదారి కనిపించకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment