
సాక్షి, కురుపాం: జీవితాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. జగనన్న వెంట నడుస్తానని తెలిపారు. కురుపాం గడ్డ.. వైఎస్సార్ కుటుంబానికి అడ్డ అని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాంలో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ... ‘వైఎస్సార్ అభిమానులు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. కట్టె కాలే వరకు వైఎస్సార్ కుటుంబంతోనే ఉంటామని అంటుంటారు. అధికార పార్టీ నన్ను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించింది. నా చేతిపై వైఎస్సార్ పచ్చబొట్టు పొడిపించుకున్నాను. ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కురుపాం నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మన సమస్యలు జగనన్న పరిష్కరిస్తారు. కురుపాం ప్రజలు, కార్యకర్తలు, జిల్లా పెద్దల ఆశీస్సులు, జగన్ ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం మేము దేనికైనా రెడీ’ అని పుష్పశ్రీవాణి అన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురించి లొంగకుండా ఉన్న పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త మాధవి అన్నారు. విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమి లేదని విమర్శించారు..
Comments
Please login to add a commentAdd a comment