
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాకు పరిటాల కుటుంబం చేసిందేమీ లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఫ్యాక్షన్ మరకలు అంటించిన ఘనత మాత్రం పరిటాల కుటుంబానికి దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు. 34వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాప్తాడు సెంటర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలోనే అనంతపురం అద్భుతంగా ఉందని, మంచి రోజులు ఉండేవని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అనంతపురాన్ని భ్రష్టుపట్టించారని, అసలు పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్‌ను ధైర్యంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలిపారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసిన తర్వాతే తన తుది శ్వాస విడుస్తానని అన్నారు.
‘జగనన్న మీరే మా దిక్కు అని, మా భవిష్యత్ మీరే’ అని వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. తమకు నీరిచ్చి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ కష్టం, పట్టుదల సామాన్యమైనది కాదని, వైయస్ రాజశేఖరరెడ్డి వారసుడు, పులివెందుల పులిబిడ్డ వైయస్ జగన్ అని కొనయాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 2009లో పెరూరు ప్రాజెక్టుకు నీరిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. నీరు వస్తుందని తామంతా కల కన్నామని, రైతులకు నీరు వస్తుందని భావించామని కానీ వైయస్‌ఆర్ మరణంతో తాము దిక్కులేని వారిమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.
హంద్రీనీవా ఎగువన ఆత్మకూరు మండలంలోని 12 వేల ఎకరాలకు నీరిస్తామని ఆరోజు టెండర్లు కూడా పిలిచారని, తమ నియోజకవర్గంలో 76 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. తమ హక్కులను కాలరాసే హక్కు టీడీపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పీఏబీఆర్ రిజర్వాయర్ నుంచి తమకు నీరు రావాల్సి ఉందని చెప్పారు. హెచ్‌ఎల్‌సీ కాల్వ వెంట ఉన్న 20 మండలాలకు పొలాలకు నీరు పారే అవకాశం ఉందని తెలిపారు. కుడికాల్వ కింద ఉన్న తాము అనాథలమయ్యామని, అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేవలం వంకల్లో నీరు ఇచ్చి సస్యశ్యామలం చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మహానేత వైయస్ ఈ జిల్లాకు నీరు తెచ్చేందుకు ప్రాజెక్టులు కడితే ఎక్కడ ఆయనకు పేరు వస్తుందో అని కనీసం పిల్ల కాల్వలు కూడా తవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తి చేశారు. తినడానికి తిండి లేక విశ్వనాథరెడ్డి అనే సర్పంచ్ బెంగుళూరులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారని, పరిటాల సునీత ఈ నియోజకవర్గానికి ఏం చేయలేకపోయారని అన్నారు.
‘వైఎస్ జగన్‌ను సీఎంగా చూశాకే తుది శ్వాస విడుస్తా’
Comments
Please login to add a commentAdd a comment