పరిటాల జ్ఞానతో వాగ్వాదం చేస్తున్న ఎస్సీ కాలనీ వాసులు
సాక్షి, అనంతపురం: ముత్తవకుంట్ల. మంత్రి పరిటాల సునీతకు సెంటిమెంట్ గ్రామం. ఆమె సొంతూరు వెంకటాపురం గ్రామానికి కూతవేటు దూరంలో ఉందీ పల్లె. సునీత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ.. ముఖ్యమైన కార్యక్రమం ఏది చేపట్టినా ఇక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. ఇలాంటి సెంటిమెంట్ గ్రామం నుంచే తిరుగుబాటు మొదలైంది. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తొలి రోజే(ఈ నెల 13) మంత్రి పరిటాల సునీతను నిలదీసిన గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు, తాజాగా ఆదివారం టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాం సతీమణి జ్ఞాన ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఆమెనూ అడ్డుకున్నారు. తమ కాలనీకి ఏం చేశారని ఓట్లు వేయాలని నిలదీశారు.
దీన్నిబట్టి చూస్తే.. ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో అందనంత అభివృద్ధి చేశామని మంత్రి పరిటాల సునీత పదేపదే చెబుతున్న మాటలు ఉత్తుత్తేనని తేలిపోయింది. తాగునీటి సమస్య తీర్చలేదంటూ ఎస్సీ కాలనీవాసులు నిలదీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జ్ఞాన ఆదివారం సాయంత్రం ముత్తవకుంట్ల ఎస్సీ కాలనీలో పర్యటించగా.. స్థానికుల నిలదీతతో ఆమె ఖంగు తినాల్సి వచ్చింది.
పరిటాల కోడలు జ్ఞాన, ముత్తవకుంట్ల ఎస్సీ కాలనీవాసుల సంభాషణ ఇలా..
కాలనీవాసి: ఎస్సీ కాలనీలో మేం సొంతంగా బోర్లు వేయించుకున్నాం. కరెంటు కోసం మన ఇంటివద్దకు వచ్చాం. మాకు న్యాయం చేసింది ఏమైనా ఒకటి ఉంటే అదిచూపించిన తర్వాత అవి(కరపత్రాలు) ఇవ్వండి తీసుకుంటాం.
జ్ఞాన: నువ్వు బాబు(శ్రీరాం)ను కానీ, అత్తయ్య(సునీత)కు కానీ చెప్పావా?
కాలనీవాసి: అత్తను కలిశాం, శ్రీరాం బాబును కలిశాం, ఇంటిదగ్గర అందరినీ కలిశాం.
జ్ఞాన: బాబు(శ్రీరాం) ఏం చెప్పాడు.. వేయిస్తామని చెప్పాడా?
కాలనీవాసి: ఏమీ చెప్పలేదు. రెండేళ్ల కిందట బోరు వేయించుకున్నాం.
కాలనీ మహిళ: ముకుంద నాయుడు ఇంకో సర్వీస్ కట్టుకోమని చెప్పాడు. నాలుగు సర్వీస్‌లు కట్టాం. అన్నీ చేశాం.
కాలనీ వాసి: ఇంతవరకూ న్యాయం జరగలేదు. ఎస్సీ కాలనీలో జెండా కట్టనివ్వలేదంటే నేనే.
జ్ఞాన: అరిచి చెప్పొద్దు బాబు.. చిన్నగా చెప్పు.
కాలనీవాసి: అమ్మయ్యా.. ఎస్సీ కాలనీలో జెండా కట్టనీలేదంటే నేనే. ఎందుకంటే మాకు న్యాయం జరగలేదు. ఇంతలో పక్కనే ఉన్న టీడీపీ కార్యకర్తలు కలగజేసుకుని జ్ఞానను అక్కడి నుంచి పక్కకు పిలుచుకెళ్లే ప్రయత్నం చేయగా.. మా ప్రాబ్లం మేం చెప్పుకుంటున్నాం. మీరు ఇలా తోలుకుపోతే మీరు న్యాయం చేయలేరు. మాకు న్యాయం జరగదు. మీరు చేయనీరు.
జ్ఞాన: ఇంటిపై జెండా(వైఎస్సార్‌సీపీ) పెట్టుకున్నావు కదప్పా పీకేసెయ్
కాలనీవాసి: జెండా ఇప్పుడే కిందకు దించుతా. నువ్వు న్యాయం చేస్తావా?
జ్ఞాన: 15 రోజులు గడువు ఇవ్వు. ఎన్నికలు అయిపోగానే మీ పని చేయిస్తాం. ఇంతలో టీడీపీ కార్యకర్తలు మరోమారు జోక్యం చేసుకున్నారు. జ్ఞానతో మాట్లాడిన యువకునిపై గొడవకు వచ్చారు. వారు కూడా అంతేస్థాయిలో స్పందించడంతో ప్రచారానికి వచ్చిన వారు అక్కడి నుంచి వెనుతిరిగారు.
ప్రచారం తొలి రోజే నిలదీత
మంత్రి పరిటాల సునీత ఈ నెల 13న కుమారుడు పరిటాల శ్రీరాంతో కలిసి వెళ్లి ముత్తవకుంట్లలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆమెకు తొలి రోజే ఎస్సీకాలనీ వాసుల నుంచి చుక్కెదురైంది. తాము తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా మీరు, మీ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇన్ని రోజులు మా సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం మా దగ్గరకు వస్తే మీకు ఎలా మద్దతిస్తామని నిలదీశారు. కాలనీలో దాదాపు అన్ని ఇళ్లకు వైఎస్సార్‌సీపీ జెండాలే కనిపించడంతో టీడీపీ నాయకులు పక్క గ్రామానికి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment