సబితను ఉద్దేశించి సర్వే వ్యాఖ్యలు.. దుమారం! | Party Ticket Issues In Telangana Congress Leaders | Sakshi
Sakshi News home page

టికెట్ల కిరికిరి

Published Wed, Jul 18 2018 9:12 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

Party Ticket Issues In Telangana Congress Leaders - Sakshi

జిల్లా కమిటీ సమావేశంలో బోస్‌ రాజు, పక్కన మాజీ మంత్రులు అరుణ, సబిత

సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రూపు రాజకీయాలకు గుడ్‌బై చెప్పి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి బోస్‌ రాజు పిలుపునిచ్చారు. టికెట్ల అంశం అధిష్టానం చూసుకుంటుందని, గెలుపు అవకాశాలు ఉన్న వ్యక్తులకే అవి దక్కుతాయని పేర్కొన్నారు. తొలుత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృíష్టిసారించాలని సూచించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సమావేశం ఇందిరాభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ అధ్యక్షతన  జరిగింది.

పార్టీ జిల్లా ఇన్‌చార్జి డీకే అరుణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సర్వే సత్యనారాయణ, గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్, కూన శ్రీశైలంగౌడ్‌ తదితరులు హాజరైన ఈ సమావేశంలో బోస్‌ రాజు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ఇప్పుడే ఖరారు చేయడం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూప్రజా సమస్యల పట్ల స్పందించిన వారికే టికెట్లు దక్కుతాయని పేర్కొన్నారు. వచ్చే వంద రోజుల్లో నాయకులందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వందరోజుల్లో బాగా పనిచేసే నేతలకు టికెట్టు కేటాయించే అవకాశం ఉందన్నారు. అన్ని మండలాల్లో బ్లాక్‌ కార్యాలయాలు ప్రారంభించాలని పేర్కొన్నారు. పార్టీ బలోపేతంపై ప్రతినెలా సమీక్షలు నిర్వహించుకోవాలని నాయకులకు సూచించారు. పార్టీలో అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు. శక్తి యాప్‌ ద్వారా పూర్తిస్థాయిలో పార్టీలో కార్యకర్తలను చేర్పించాలన్నారు. 

దుమారం రేపిన సర్వే వ్యాఖ్యలు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డైనమిక్‌ లీడర్‌ని, ఆమెకు చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే మాటలపై ఆమె అనుచరులు ఫైర్‌ అయ్యారు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలనుకుంటున్నానని కొంతకాలంగా ఆమె పేర్కొంటూ వచ్చిన నేపథ్యంలో సర్వే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సబిత మహేశ్వరం నుంచే పోటీ చేయాలని కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అలాగే ఏఐసీసీ కార్యాదర్శి రాజుపైనా సర్వే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బోస్‌ రాజు డబ్బుల మనిషి కాదన్నారు. ఆయనకు తక్కువలో తక్కువగా వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. అలాగే వికారాబాద్‌ టికెట్‌ గడ్డం ప్రసాద్‌కే ఇవ్వాలన్నారు. వాస్తవంగా చంద్రశేఖర్‌ ఆ టికెట్‌ను ఆశిస్తున్నారని కానీ గెలిచే సత్తా ప్రసాద్‌కే ఉందన్నారు. అయితే సర్వే వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ గరమయ్యారు. పార్టీలో గ్రూపులు పెడితే అధికారంలోకి రాలేమని పేర్కొన్నారు. కేవలం గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టికెట్‌ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్‌ అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకుంటే కొంతమంది నాయకులు రాష్ట్రం విడిచిపెట్టిపోయే పరిస్థితులు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్‌.. తన కుటుంబాన్ని మాత్రమే బంగారంగా తయారు చేశారని ఎద్దేవా చేశారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  సార్వత్రిక ఎన్నికలకు ముందే విపక్ష కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో బరిలోదిగాలని భావిస్తున్న ఆశావహులు ఏఐసీసీ కార్యదర్శి ఎదుట బలప్రదర్శనకు దిగారు. కాంగ్రెస్‌ మార్కు గ్రూపు రాజకీయాలతో జిల్లా రాజకీయాన్ని వేడెక్కించారు. దీనికి గాంధీభవన్‌ వేదికైంది. జిల్లాలో పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకు మంగళవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు ని యోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం.. వచ్చే ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నామని హైకమాండ్‌ దూత స్పష్టం చేసినా ఇదేం వినిపించుకోని కొందరు టికెట్ల ఖరారుపై పట్టుబట్టారు. తమ నేతను అభ్యర్థిగా ప్రకటించాల్సిందేనని పదే పదే డిమాండ్‌ చేశారు. 

మాజీ మంత్రి చంద్రశేఖర్‌ డుమ్మా..
వికారాబాద్‌ సెగ్మెంట్‌లో మరోసారి కాంగ్రెస్‌ గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ సమావేశానికి గైర్హాజరయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన రాలేదని చెప్పారు. అయితే, టికెట్‌ ఖరారుపై మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అనుచరులు పట్టుబట్టారు. టికెట్టు అంశం తేల్చాల్సిందేనని భీష్మించారు. చంద్రశేఖర్‌ టికెట్‌ ఖాయమని ప్రచారం చేసుకుంటుండడంతో శ్రేణుల్లో గందరగోళం నెలకొందని, దీనికి ముగింపు పలకాలని బోస్‌రాజును కోరారు. టికెట్ల ఖరారు ఏఐసీసీ చూసుకుంటుందని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో విలేకర్ల సమావేశానికి హాజరుకావాలని ప్రసాద్‌ను కోరినా ఆయన విసురుగా సమావేశమందిరం నుంచి నిష్క్రమించడం పార్టీలో నెలకొన్న లుకలుకలను బట్టబయలు చేసింది.

స్థానికులకే టికెట్టు ఇవ్వాలి
స్థానికేతరులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుండదని మేడ్చల్‌ నియోజకవర్గ సమీక్షలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సింగిరెడ్డి రాంరెడ్డి స్పష్టం చేశారు. స్థానికులను పరిగణనలోకి తీసుకోకుండా మరోసారి స్థానికేతరులను బరిలో దించితే పార్టీకి నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. భారీ మెజార్టీతో ఓడిపోయిన అభ్యర్థికే పార్టీ కమిటీల భర్తీ బాధ్యతలను అప్పగించడం సమంజసంగా లేదన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగుందని, అభ్యర్థిత్వంపై మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా, అంతకుముందు విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.

లక్ష్మారెడ్డిని కట్టడి చేయాలి
డీసీసీబీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి వ్యవహారశైలితో పార్టీకి తీరని నష్టం కలుగుతోందని తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రమేశ్‌ ఫిర్యాదు చేశారు. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ అధికార పార్టీకి లాభం చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లక్ష్మారెడ్డి సహా మరికొందరు నేతలు అసంతృప్తి రాజకీయాలను విడనాడేలా అధిష్టానం చొరవచూపాలని సూచించారు. 

ప్రచారాలకు తెరవేయండి
చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి స్థానికుడినే బరిలో దించాలని ఆ నియోజకవర్గ నేతలు సూచించారు. ఇతర ప్రాంతాల నేతలు ఇక్కడకు రానున్నారనేప్రచారానికి తెరవేయాలని, స్థానికేతరులను పోటీచేయిస్తే స్థానిక ఆశావహులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. పార్టీ పట్ల క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తున్న వెంకటస్వామికి టికెట్టు ఖరారు చేయాలని నాయకులు సూచించారు. పరిగి, మహేశ్వరం, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్న బోస్‌ రాజు.. సమిష్టిగా పనిచేస్తే తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం దక్కడం ఖాయమని వ్యాఖ్యానించారు. పార్టీకి నష్టం జరిగేలా వర్గవిభేదాలను ప్రోత్సహించే నేతలు ఏ స్థాయిలో ఉన్నా సహించేదిలేదని హెచ్చరించారు.  

టికెట్ల ఖరారు చేసేది అధిష్టానమే:ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు
ముందుగానే టికెట్లను ఖరారు చేసే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీలో లేదని ఏఐసీసీ కార్యదర్శి బోస్‌ రాజు స్పష్టం చేశారు. ఇప్పటివరకు కొందరు నేతలు టికెట్లను ప్రకటించినప్పటికీ, అవి శ్రేణుల్లో స్ఫూర్తి నింపేందుకే తప్ప ఖరారు చేసినట్లుగా భావించవద్దని సూచించారు. ప్రస్తుతం పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అధిష్టానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్, నేతలు కార్తీక్‌రెడ్డి, రమేశ్‌తో కలిసిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు శ్రేణులను ఏకతాటి మీదకు తేవడానికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామని తెలిపారు. బూత్, మండల, బ్లాక్, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను పటిష్టం చేయనున్నామని, ఈ నెలాఖరులోగా సంస్థాగత నియామక ప్రక్రియను పూర్తిచేసిన అనంతరం ప్రతి నియోజకవర్గానికో సమన్వయకర్తను నియమించనున్నట్లు చెప్పారు. ఇతర జిల్లాలకు చెందినవారిని సమన్వయకర్తలుగా నియమిస్తామని తెలిపారు. పార్టీ పనితీరు, ప్రత్యర్థి పార్టీ బలాబలాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించే బాధ్యత ఈ కో అర్డినేటర్లదని అన్నారు. నియోజకవర్గంలో పార్టీని సమన్వయపరచడం.. ప్రభుత్వ విధానాలపై పోరాటాలు సాగించేలా సమన్వయకర్త పనిచేయాల్సివుంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను పరిశీలించేందుకు నియోజకవర్గాల్లో పర్యటిస్తామని, ఎక్కడ పార్టీ వెనుకబడిందో హైకమాండ్‌కు నివేదిస్తామని బోస్‌రాజు స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు శక్తియాప్‌ను సాధ్యమైనంత ఎక్కువ మంది వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు. సెగ్మెంట్‌కు సగటున 5వేల మందిని శక్తి యాప్‌ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement