సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాజధానుల అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పూటకో మాట మారుస్తున్నారు. ఒకే రోజు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. తొలుత మూడు రాజధానులపై కేంద్ర ప్రభుత్వ సమ్మతి లేదని ప్రకటించారు. వెంటనే తప్పును సవరించుకొని రాజధాని మార్పుకు కేంద్రం సమ్మతి అవసరం లేదని తెలిపారు.
(చదవండి : ఏమయ్యా పవన్‌నాయుడు అది నోరా.. లేక)
ఓ పార్టీ అధినేతగా ఉన్న పవన్ .. రాజధాని అంశంపై పూర్తి అవగాహన లేకుండా నిమిషాల వ్యవధిలో మాటలు మార్చడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, రాజధాని అంశంలో తాము జోక్యం చేసుకోమని బీజేపీ జాతీయ నాయకత్వం ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిందని, కేంద్రానికి ఎటువంటి పాత్ర ఉండబోదని స్పష్టం చేసిన సంగతి విదితమే.
రాజధాని మార్పుపై పవన్ అనుసరిస్తున్న వైఖరిపట్ల సోషల్ మీడియాలో సైతం వ్యంగ్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ వైఖరిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. పార్టీ పెట్టినప్పుడు ఒకలా.. ఎన్నికల సమయంలో మరోలా మాట్లాడిన పవన్.. తాజాగా అమరావతి రైతుల వద్ద మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
గతంలో ఆయన మాట్లాడిన వీడియోలను పోస్టు చేసి.. పవన్‌నాయుడుకు క్లారిటీ ఇవ్వండయ్యా అని కొందరు నెటిజన్లు చురకలు వేస్తున్నారు. ‘మీరేం మాట్లాడుతున్నారో.. అర్థమవుతుందా’ అని విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతమైతే.. ప్రాంతీయ వైషమ్యాలు తలెత్తుతాయని పవన్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment