
సాక్షి, ఏలూరు: ఓ దళిత కార్మికుడిపై ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖండించారు. మంగళవారం ఏలూరు పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ను చింతమనేని చేతిలో దాడికి గురైన బాధితుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకోవడం, పోలీసులను తుపాకులతో బెదిరించడం, తాజాగా దళిత కార్మికుడిపై కులం పేరుతో దాడి చేసి దూషించడం చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని చింతమనేని దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.
భద్రతతో కూడిన పాలన అందిస్తారనే తాను 2014లో టీడీపీకి మద్దతిచ్చానని తెలిపారు. కానీ చింతమనేని వ్యవహార శైలి రౌడీ షీటర్‌ను తలపిస్తుందని.. 37 కేసుల్లో ముద్దాయిగా ఉన్న చింతమనేనిపై ఇది 38 వకేసు అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు దళితతేజం అంటే.. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దళితులను కులాల పేరుతో దూషించి దాడులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం తన ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో పెట్టుకోకపోతే ఆ బాధ్యతను ప్రజలే తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? లేక.. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారా అని చంద్రబాబుని ప్రశ్నించారు.