
సాక్షి, అమరావతి : ఎంతో అనుభవం, నైపుణ్యం కలిగిన ప్రస్తుత రాజకీయ నేతలు చేస్తున్న ప్రయోగాలు వ్యవస్థకు మంచి చేయకపోగా కీడు చేస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. లోప భూయిష్టమైన పబ్లిక్ పాలసీలు, అసమాన ఆర్థికాభివృద్ధి, బలహీన వర్గాలపై బలంగా పనిచేసే చట్టాలు, బలంగా ఉన్న వారిపై బలహీనంగా పనిచేసే చట్టాలు... ఇలా ఎన్నో అంశాలు వ్యవస్థను పీడిస్తున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు ఆక్వాపార్కు అంశాన్ని ఉదాహరణగా పేర్కొంటూ.. ఆ ప్రాంతానికి చెందిన యువకులు తనను కలిశారని, పాలకులు తమకు కనీసం స్వచ్ఛమైన గాలి, నీరు కూడా లేకుండా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రాథమిక హక్కుల కోసం కూడా ప్రజలు పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఇదే భావనలో ఉన్నారన్నారు. ప్రజల పట్ల, వ్యవస్థల పట్ల రాజకీయ నేతలకు ఎలాంటి పట్టింపులు లేకపోవడం వ్యవస్థను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.