
సాక్షి, ముమ్మిడివరం : టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తనకు ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడిగా మాత్రమే తెలుసని, కానీ న్యూస్ పేపర్లలో అతని గురించి చదివి ఆశ్చర్యపోయానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. సుజనా చౌదరి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వేలకోట్లు దోచేశారని, కార్లు సీజ్ అయ్యాయని వార్తా పేపర్లలో చదివి షాక్ గురయ్యానని తెలిపారు. టీడీపీ రాష్ట్రాన్ని దోచేసిందే తప్పా.. అభివృద్ధి చేయలేదన్నారు. గత ఎన్నికల్లో జనసేన అండలేకుంటే టీడీపీ 37 సీట్లతో ప్రతిపక్షంలో ఉండేదని చెప్పారు.
డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయరు కానీ.. పారిశ్రామిక వేత్తలు, రాజ్యసభ సభ్యులు మాత్రం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించరని మండిపడ్డారు. అయినా బ్యాంకులు వారిని ఏమి చేయలేవన్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యే ఆకురౌడీలా, వీధి రౌడీలా వ్యవహరిస్తుంటే అదుపు చేయలేని ఆయన ఓ ముఖ్యమంత్రా? అని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు. ఆడపడుచులను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి కొడుతుంటే.. సస్పెండ్ చేయలేని వ్యక్తి ఏం సీఎం అని మండిపడ్డారు. యువత త్యాగాలు చేయాలని సీఎం చంద్రబాబు చెబుతారని.. మరీ ఆయనేం చేస్తారని, తాము త్యాగాలు చేస్తే.. వారబ్బాయి రాజధాని రోడ్లపై తిరుగుతాడా? అని నిలదీశారు. మాట్లాడితే చంద్రబాబు సింగపూర్ తరహా అభివృద్ధి అంటారని, మరి ఆ అభివృద్ధి ఎక్కడ కనపడుతుందో చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment