
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నినాదం.. ‘దూషణలనే నమ్ముకుంటాం’ అంటూ జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ ధ్వజమొత్తారు. ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీకి, కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ వరుస ట్వీట్ల పరంపర సోమవారం కూడా కొనసాగింది. ‘‘టీడీపీలో ‘తల్లులు, చెల్లెళ్లను తిట్టే వింగ్’ ప్రధాన కార్యదర్శి ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు.. బూతుజ్యోతి రత్న ఆర్కే’’ అంటూ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తాను ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తే శ్రీసిటీ శ్రీనిరాజు అతని లాయర్ ద్వారా నాకు లీగల్ నోటీసులు పంపారని.. ఇందులో ఉన్న మతలబు ఏంటో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. తర్వాత శ్రీనివాసరాజు చలపతి 2009–10 ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి రూ.కోటి విరాళం ఇచ్చారంటూ కొన్ని పేపర్లను ట్వీటర్‌లో ఉదహరించారు. తమ లాంటి వారిపై ఆ మూడు చానల్స్ చేస్తోన్న మానసిక అత్యాచారాలను నిరోధించడానికి ఎలాంటి ‘నిర్భయ చట్టం’ కావాలని ప్రశ్నించారు. 6 నెలల పాటు తనపై బహిరంగ దూషణలు చేసి, మానసిక అత్యాచారాలు చేసి చాటుమాటుగా క్షమాపణలు చెబుతానంటే తన దగ్గర కుదరదని స్పష్టం చేశారు.
వృద్ధురాలైన తన తల్లినీ వదలకుండా దూషించి, ఇప్పుడు క్షమాపణలు చెబుతామంటూ రహస్యంగా తనకు లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. అలాగే ‘మనల్ని, మన తల్లులను, ఆడపడుచులను తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ల టీవీలు ఎందుకు చూడాలి? అని ప్రశ్నించారు. జర్నలిజం విలువలు, సమదృష్టి కోణంతో ఉండే చానల్స్, పత్రికల పక్షాన నిలబడతాం’ అని పేర్కొన్నారు. అలాగే త్వరలోనే తెలుగు చిత్రపరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటవుతుందని, దీనికి జనసేన వీరమహిళా విభాగం అండగా ఉంటుందని తెలిపారు.
అలాగే సోమవారం రాత్రి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ఆర్కే) కుటుంబ ఫొటో ఉంచి.. ‘‘బాబూ.. నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం, కూర, పప్పుతో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా.. అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తలస్నానం చెయ్యమని చెప్పండి..’’ అని వ్యంగ్యంగా పోస్టు చేశారు. మంగళవారం తన చిత్తూరు జిల్లా పర్యటన వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.