దాడి చేసింది రైతులు కాదు.. టీడీపీ గూండాలే  | Pinnelli Ramakrishna Reddy Fires On TDP And Chandrababu | Sakshi
Sakshi News home page

దాడి చేసింది రైతులు కాదు.. టీడీపీ గూండాలే 

Published Wed, Jan 8 2020 5:34 AM | Last Updated on Wed, Jan 8 2020 8:30 AM

Pinnelli Ramakrishna Reddy Fires On TDP And Chandrababu  - Sakshi

మాట్లాడుతున్న పిన్నెల్లి, అంబటి తదితరులు

సాక్షి, అమరావతి బ్యూరో/పట్నంబజారు/మంగళగిరి:  రాజధాని రైతుల ముసుగులో పక్కా ప్రణాళికతో టీడీపీ గూండాలు తనపై దాడి చేశారని ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పథకం ప్రకారం కొంతమంది బయటివారిని తీసుకొచ్చి ఈ దాడి చేయించారన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై దాడులు చేసి.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజధానిలో ఏదో జరిగిపోతున్నదని శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలని మాజీ సీఎం ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద తన కారుపై దాడి ఘటన అనంతరం పీఆర్కే.. ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో కలసి గుంటూరులో విలేకరులతో మాట్లాడారు.

అంతకుముందు కాజ గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత అన్నపురెడ్డి బ్రహ్మానందరెడ్డి కార్యాలయంలోనూ మీడియాతో మాట్లాడారు. తాను గుంటూరు నుంచి విజయవాడకు సర్వీసు రోడ్డుపై వెళుతుండగా.. మూకుమ్మడిగా తన కారుపైకి 50 మందికిపైగా వచ్చి రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. కారును ధ్వంసం చేశారని, గన్‌మెన్‌పై దాడి చేశారని చెప్పారు. తనపై దాడికి పాల్పడింది రైతులు కాదని, టీడీపీ అల్లరిమూకలు, బయటినుంచి వచ్చిన గూండాలేనన్నారు. నిజంగా రైతులే దాడి చేసుంటే.. అప్పటికప్పుడు వాళ్ల చేతిలోకి రాళ్లు, కర్రలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలు, ఓ వర్గం వారు తమ కలలు చెరిగిపోతున్నాయనే అసూయతో దాడిచేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారన్నారు. రాజధాని రైతులు చంద్రబాబు ట్రాప్‌లో పడవద్దని హితవు పలికారు. తన కారుమీద రాళ్లు వేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. 

దాడులు చేయించటం బాబుకు కొత్తేమీ కాదు: అంబటి 
అమరావతిపై జరుగుతున్న ఆందోళన శ్రుతి మించుతోందని అంబటి రాంబాబు అన్నారు. ఉద్యమం పేరుతో దాడులకు దిగుతూ.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని వైఎస్సార్‌సీపీ సీరియస్‌గా పరిగణిస్తోందన్నారు. చంద్రబాబు వ్యక్తిగత పర్యవేక్షణలో ఉద్యమం పేరుతో కొంతమంది హింసాకాండలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన పదవికి నష్టం వాటిల్లితే చంద్రబాబు ఎంతటి దుర్మార్గాలకైనా వెనుకాడరన్నారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు టీడీపీ నాయకులందరికీ చంద్రబాబే బస్సులు కాల్చండి, హింసను ప్రోత్సహించండని పిలుపునిచ్చిన విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలో పేర్కొన్నారని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక వర్గానికి చెందినవారు చంద్రబాబు ప్రోద్బలంతో ఉద్యమాలు చేపడుతున్నారన్నారు. కుట్రపూరితంగా ఉద్యమం జరుగుతోందని, అందుకు నిదర్శనం మీడియా యాంకర్‌ దీప్తిపై, ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడులు చేయటమేనన్నారు. ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ పిన్నెల్లిపై జరిగిన హత్యాయత్నం టీడీపీ ఉన్మాదుల చర్యేనన్నారు. వీడియో ఫుటేజీల ద్వారా దాడి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

బాబూ.. ముసుగు తీసి రా 
చంద్రబాబూ.. రాజధాని ముసుగులో కాకుండా, ముసుగు తీసి నువ్వూ నీ కొడుకు రండి.. తెరవెనుక రాజకీయాలు చేయడమేంటని పీఆర్కే మండిపడ్డారు. డైరెక్ట్‌గా వస్తే తమ సత్తా ఏంటో చూపుతామన్నారు. రాజదాని ముసుగులో భయపెట్టాలని చూస్తే బెదిరేవారు ఎవరూ లేరన్నారు. మీకు దమ్ముంటే తమను టచ్‌ చేస్తే తమ సత్తా ఏంటో చూపుతామన్నారు. 

సీఎంను కలిసిన పిన్నెల్లి 
ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ని కలిశారు. తనపై జరిగిన దాడి గురించి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులకోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని డిస్ట్రబ్‌ చేసేందుకు, ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే అమ్మఒడి పథకం నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే చంద్రబాబు రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. మరొక్కసారి తమ జోలికొస్తే పల్నాడు పౌరుషం చూపిస్తామన్నారు. దాడికి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాల వీడియోను ఎస్పీని కలసి అందజేసినట్టు తెలిపారు. రాజధాని రైతులపై సీఎంకు పూర్తి సానుభూతి ఉందని, తప్పక న్యాయం చేస్తారని తెలిపారు. రాజధానిలో బాబు చేసిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బయటపడుతుందని రాజధాని రైతులను చంద్రబాబు రెచ్చగొట్టి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement