సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రధాని మోదీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని, ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. ఎంపీ రేణుకా చౌదరి పదేపదే అడ్డుపడిన సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతుండగా.. ఆమె గట్టిగా నవ్వుతూ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సభాపతిగా ఉన్న వెంకయ్యనాయుడు.. ప్రధాని ప్రసంగానికి అడ్డు తగలవద్దంటూ రేణుకను ఘాటుగా మందలించారు. మీకు ఏమైనా సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాలని, అంతేకానీ సభలో అనుచిత ప్రవర్తనను సహించబోనని వెంకయ్య ఘాటుగా పేర్కొన్నారు. ఈ దశలో ప్రధాని మోదీ కల్పించుకుంటూ.. 'సభాపతిగారు.. రేణుకాజీని ఏమీ అనొద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. రామాయణం సీరియల్ తర్వాత ఇంతటి నవ్వులను వినే సౌభాగ్యం ఇప్పుడే దక్కింది' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అనంతరం సభ వెలుపల రేణుకా చౌదరి స్పందించారు. 'ప్రధాని మోదీ నాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? ఆయన స్థాయికి దిగజారి నేను బదులు ఇవ్వలేను. మహిళలను ఇది కించపరిచడమే' అని ఆమె మండిపడ్డారు. గతంలో ఆధార్‌కు వ్యతిరేకంగా యూపీఏ సర్కారుపై విమర్శలు చేసిన మోదీ.. ఇప్పుడు ఆ ఆధార్ పథకానికి అద్వానీ ప్రసంగంలో మూలాలు ఉన్నాయని చెప్పడం తనకు నవ్వు తెప్పించిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment