బీజేపీ అధ్యక్షుడయ్యాక జరిగిన తొలి పార్లమెంటరీ పార్టీ భేటీలో నడ్డాను సన్మానిస్తున్న మోదీ, ఇతర నేతలు
న్యూఢిల్లీ: జాతీయ భద్రత, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతునిచ్చే ప్రభుత్వ అవసరమే ఢిల్లీకి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకలో సభలో మాట్లాడారు. ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసే ప్రభుత్వాలు ఇప్పుడు రాజధానికి అవసరం లేదని, సరైన దిశానిర్దేశం చేసే ప్రభుత్వమే కావాలని ఆప్‌పై ఆరోపణలు గుప్పించారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ విద్వేష రాజకీయాలను ప్రేరేపిస్తోందని ప్రధాని ఆరోపించారు. శత్రువులు మనపై దాడి చేసేలా ప్రోత్సహించే ప్రభుత్వం ఢిల్లీకి ఇక అవసరం లేదని పిలుపునిచ్చారు. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల కోసం కన్నీరు కార్చేవారు ఢిల్లీని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.
అమెరికా జనాభా కంటే ఎక్కువ మంది పేదలకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించామని, శ్రీలంకలో ఉండే జనాభా కంటే ఎక్కువగా ఇళ్లు కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని మోదీ అన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయకపోవడాన్ని ప్రధాని తప్పుపట్టారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యుత్తమమైనదని మోదీ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇప్పుడు విమర్శకులూ అంగీకరిస్తున్నారని అన్నారు. బడ్జెట్‌పై విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరై మోదీ ఎంపీలనుద్దేశించి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment